మంచు మనోజ్ 15 కిలోల వేరియేషన్

Update: 2017-05-20 11:41 GMT
అమీర్ ఖాన్.. విక్రమ్ మాత్రమే కాదు.. పాత్రల కోసం ఒంటిని ఎంతైనా కష్టపెట్టుకునే హీరోలు చాలామందే ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కెరీర్ ఆరంభం నుంచి సినిమాల కోసం చాలాసార్లు తన శరీరాన్ని కష్టపెట్టుకున్నాడు. అప్పట్లో ‘నేను మీకు తెలుసా’ సినిమా కోసం మనోజ్ ఎంత కష్టపడ్డాడో తెలిసిందే. తాజాగా ‘ఒక్కడు మిగిలాడు’ కోసం మనోజ్ చాలానే శ్రమించాడంటున్నాడు ఈ చిత్ర దర్శకుడు అజయ్ నూతక్కి. మనోజ్ ఇందులో ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ క్యారెక్టర్ తో పాటు కాలేజీ స్టూడెంట్ గా మరో క్యారెక్టర్ కూడా చేస్తున్నాడు. ఈ రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించడం కోసం మనోజ్ ఏకంగా 15 కిలోల బరువు తగ్గాడట.

ప్రభాకరన్ క్యారెక్టర్లో చాలా లావుగా.. భీకరంగా కనిపిస్తున్న మనోజ్.. కాలేజీ స్టూడెంట్ పాత్రలో సన్నబడి స్మార్ట్ గా దర్శనమిస్తున్నాడు. ఈ రోజు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ స్టూడెంట్ లుక్ రిలీజ్ చేశారు. రెండు పాత్రల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తమిళంలో ‘రావణ దేశం’ అనే సినిమా తీసిన అజయ్ నూతక్కి తెలుగువాడే. తొలి సినిమా తరహాలోనే శ్రీలంకలోని తమిళుల సమస్య నేపథ్యంలో ‘ఒక్కడుమిగిలాడు’ చేస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని.. ఈ సినిమా అతడి కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని దర్శకుడు అంటున్నాడు. ఈ చిత్రంలో మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటిస్తోంది. జులైలో ‘ఒక్కడు మిగిలాడు’ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News