ఆ విషయంలో రాజమౌళి ఆదర్శం, మార్గదర్శకం : మణిరత్నం

Update: 2023-04-24 13:07 GMT
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్‌ సెల్వన్‌ 2 ఈనెల 28వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మొదటి పార్ట్‌ తెలుగు లో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక పోయింది. అయినా కూడా రెండవ పార్ట్‌ పై ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా తాజాగా హైదరాబాద్ లో భారీ ప్రమోషన్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్‌ కు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి బాహుబలి ని రెండు భాగాలుగా చేసి ఉండక పోతే నాకు పొన్నియిన్ సెల్వన్‌ ను రెండు భాగాలు చేసే ఆలోచన వచ్చేది కాదేమో అన్నాడు.

ఇంకా మణిరత్నం మాట్లాడుతూ... పౌరాణిక సినిమాలకు రాజమౌళి మార్గదర్శకం అనడంలో సందేహం లేదు. ఇండియన్ సినిమా ప్రేక్షకులకు మరియు ఇండియన్ సినీ ఫిల్మ్ మేకర్స్ కు రాజమౌళి కొత్త సినిమాను చూపించాడు. ఆయన రూపొందించిన సినిమాలు ఎంతో మందికి ఆదర్శం మరియు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మణిరత్నం కామెంట్స్ చేశారు.

మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్ 2 ను లైకా ప్రొడక్షన్స్ మరియు పెన్‌ ఇండియా లిమిటెడ్‌.. రెడ్ జెయింట్‌ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. గత సంవత్సరం విడుదల అయిన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా భారీ విజయాన్ని తమిళనాట సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. ప్రముఖ స్టార్స్ నటించడం వల్ల తెలుగు లో కూడా బజ్‌ క్రియేట్‌ అయ్యింది కానీ కలెక్షన్స్ విషయంలో నిరాశే మిగిలింది.

Similar News