దేవీ.. తమన్ లకు ఎర్త్ పెడతాడా??

Update: 2020-04-03 00:30 GMT
టాలీవుడ్ లో మొదటినుంచి మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఉంది. టాప్ లీగ్ స్టార్ల సినిమాలకు సంగీతం అందించగలిగే రేంజ్ ఉన్న సంగీత దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్లలో చూసుకుంటే దేవి శ్రీ ప్రసాద్.. తమన్ ముందు వరుసలో ఉంటారు. కీరవాణి గారు ఉన్నప్పటికీ ఆయన సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉంటారు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్ లకు ఈ స్థాయి నిలకడ లేదు. దీంతో మన ఫిల్మ్ మేకర్ లు ఇతర భాషా సంగీత దర్శకులపై ఆధార పడుతున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఫామ్ లోకి రావడం చాలామంది ఫిలింమేకర్ లకు ఊరట నిచ్చింది.

ఓ పదేళ్ల క్రితం నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ ను ఏలిన మణిశర్మ టాప్ హీరోలందరి సినిమాలకు సంగీతం అందించారు. అయితే కొంతకాలం తర్వాత ఫామ్ ను కోల్పోయారు.  అయితే పోయిన ఏడాది విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' తో ఆయన మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అరడజను క్రేజీ ప్రాజెక్టు లకు సంగీతం అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'ఆచార్య' కు మణిశర్మని సంగీత దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల - రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రెడ్' సినిమాకు కూడా మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలే కాదు.. వెంకటేష్ 'నారప్ప'.. గోపీచంద్ 'సిటీమార్'.. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ సినిమా 'ఫైటర్'.. సాయి ధరమ్ తేజ్ - దేవా కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇవే కాదు.. ఫ్యూచర్ లో తెరకెక్కబోయే పలు ఇతర సినిమాలకు కూడా మణిశర్మ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. మెలోడీ బ్రహ్మ గారి వరస చూస్తుంటే రాబోయే రోజుల్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు తమన్.. దేవి శ్రీ ప్రసాద్ లకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News