సౌత్ సినిమా బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టించింది: మనోజ్ బాజ్ పాయ్

Update: 2022-04-29 02:30 GMT
దక్షిణాది సినిమాల విజయాలు చూసి బాలీవుడ్ కు వెన్నులో వణుకు పుడుతోంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విలక్షణ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్. ఇటీవల కాలంలో అనేక సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అదే సమయంలో హిందీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోతున్నాయి.

'పుష్ప' 'RRR' 'కేజీఎఫ్ 2'.. ఇలా మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి నార్త్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి. డబ్బింగ్ చిత్రాలు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంటే.. మరోవైపు హిందీ సినిమాలు మాత్రం కనీస వసూళ్ళు సాధించడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ మీద సౌత్ డామినేషన్ ను స్పష్టంగా తెలియజేస్తోంది.

దేశవ్యాప్తంగా దక్షిణాది సినిమాల హవా కొనసాగడం గురించి ఇప్పటికే పలువురు హిందీ ప్రముఖులు కామెంట్స్ చేయగా.. తాజాగా మనోజ్ బాజ్ పేయి కూడా మన చిత్రాలను ప్రశంసిస్తూ బాలీవుడ్ కి చురకలు అంటించారు. సౌత్ సినిమాల విజయానికి బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారని.. వారికి వెన్నులో వణుకు పుడుతోందని.. ఏం చేయాలో అంతుపట్టడం లేదని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ వ్యాఖ్యానించారు.

'పుష్ప: ది రైజ్' 'ఆర్.ఆర్.ఆర్' 'కేజీయఫ్ 2' వంటి సినిమాలు హిందీ చిత్రాలను మించి విజయాన్ని సాధించడం గురించి మనోజ్ బాజ్ పాయ్ విశ్లేషించారు. కరోనా పాండమిక్ తర్వాత తెలుగు చిత్రం 'పుష్ప' డబ్బింగ్ వెర్సన్ నార్త్ బెల్ట్‌ లో వంద కోట్లకు పైగా వసూలు చేసి ట్రెండ్ ప్రారంభించింది. ఇప్పుడు RRR - 'కేజీఎఫ్ 2' సినిమాలు హిందీలో భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇది బాలీవుడ్‌ లోని చాలా మందిని కలవరపెట్టింది అని మనోజ్ అన్నారు.

భారీ బడ్జెట్ హిందీ సినిమాలు దేశం మొత్తం మీద రూ.200 కోట్లకు చేరుకోవడానికి కష్టపడుతున్నప్పుడు.. RRR - కేజీఎఫ్ 2 వంటి హిందీ డబ్బింగ్ సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూలు చేస్తుండటంపై మనోజ్ మాట్లాడారు. సౌత్ సినిమాల విజయం బాలీవుడ్‌ కు ఒక పాఠం అని.. ముంబై ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్ త్వరగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మనోజ్.

సౌత్ సినిమాలు ఉద్వేగభరితంగా.. వరల్డ్ క్లాష్ షాట్స్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయని.. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో పల్స్ పట్టుకొని సక్సెస్ అవుతున్నారని మనోజ్ అభిప్రాయ పడ్డారు. అందుకే పుష్ప -  ఆర్ఆర్ఆర్ - కేజీఎఫ్ సినిమాలు ఈ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని.. ప్రతి ఫ్రేమ్‌ ని వాస్తవంగా చిత్రీకరించారని చెప్పారు.

మెయిన్ స్ట్రీమ్ సినిమా అంటే కేవలం డబ్బు.. బాక్సాఫీస్ పరంగానే సౌత్ మేకర్స్ ఆలోచించడం మొదలుపెట్టారని.. అలా మనల్ని మనం విమర్శించుకోలేం కానీ.. మెయిన్ స్ట్రీమ్ సినిమాను ఎలా నిర్మించాలనేది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు ఇది ఒక పాఠం అని సీనియర్ నటుడు అన్నారు.
Tags:    

Similar News