భారీస్థాయిలో చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్!

Update: 2022-02-07 09:35 GMT
మెగా వారసుడిగా తెలుగు తెరకి చరణ్ పరిచయమయ్యాడు. టాలీవుడ్ లో చిరంజీవి ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన హీరో. డాన్సులు .. ఫైట్లలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన మెగాస్టార్. అలాంటి ఆయన వారసుడిగా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. కానీ తన రెండవ సినిమాతోనే ఆ అంచనాలను చరణ్ అందుకోగలిగాడు.

డాన్స్ .. ఫైట్లలో తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నాడు. ఆ తరువాత కూడా తనని తాను మార్చుకుంటూ .. మలచుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

అలాంటి చరణ్ పుట్టినరోజు మార్చి 27వ తేదీన. దాంతో ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఆన్ లైన్ లోను .. ఆఫ్ లైన్ లోను ఒక రేంజ్ లో నిర్వహించడానికి మెగా అభిమానులు సిద్ధమవుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా మెగా అభిమానులు చరణ్ బెర్త్ డే వేడుకలను తాము అనుకున్నట్టుగా నిర్వహించలేకపోయారు. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ సారి చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను వైభవంగా జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. 50 రోజుల ముందు నుంచే ఈ ప్రణాళిక సిద్ధమవుతుండటం విశేషం.

ఈ సారి చరణ్ జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు వేడుకకి ఒక ప్రత్యేకత ఉంది. తన కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో కూడిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేయడం .. తనకి అత్యంత సన్నిహితుడైన ఎన్టీఆర్ తో కలిసి నటించడం .. తొలిసారిగా ఒక చారిత్రక చిత్రంలో .. అందునా ఈ జనరేషన్లో అల్లూరి పాత్రను పోషించడం ప్రధానమైన విశేషంగా చెప్పుకోవచ్చును. ఈ సినిమా చరణ్ కెరియర్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతుండటం మరో విశేషం. ఇక తన తండ్రితో కలిసి తొలిసారిగా ఆయనతో సమానమైన పాత్రను పోషించిన 'ఆచార్య' కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

చరణ్ పుట్టినరోజుకు కాస్త ముందు 'ఆర్ ఆర్ ఆర్' విడుదలవుతుంటే, బర్త్ డే తరువాత నెలలో 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే ఏడాదిలో ఆయన శంకర్ సినిమాలో చేస్తుండటం కూడా మరో విశేషం. కెరియర్ పరంగా 15వ సినిమాను ఆయన పూర్తి చేయనున్నాడు. ఇలా ఈ ఏడాదిలో ఆయన మూడు భారీ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చినప్పటికీ, చాలా తక్కువ గ్యాపులో ఆయన నుంచి ఇంతటి భారీ సినిమాలు వస్తుండటం ఇదే మొదటిసారి గనుక ఇదో రికార్డుగానే చెప్పుకోవచ్చు. 
Tags:    

Similar News