మూవీ రివ్యూ : ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)

Update: 2017-12-21 08:32 GMT
చిత్రం : ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)

నటీనటులు: నాని - సాయి పల్లవి - భూమిక - విజయ్ వర్మ - రాజీవ్ కనకాల - నరేష్ - ఆమని - ప్రియదర్శి - రచ్చ రవి - పవిత్ర లోకేష్ - శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
మాటలు: మామిడాల తిరుపతి - శ్రీకాంత్
నిర్మాతలు: దిల్ రాజు - శిరీష్ - లక్ష్మణ్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వేణు శ్రీరామ్

మూడేళ్ల నుంచి వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్నాడు హీరో నాని. ఈ ఏడాది ఇప్పటికే అతను ‘నేను లోకల్’.. ‘నిన్ను కోరి’ సినిమాలతో విజయాలందుకున్నాడు. ఇప్పుడు ‘ఎంసీఏ’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ రూపొందించిన చిత్రమిది. మరి మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాని ఆకట్టుకున్నాడా.. తన విన్నింగ్ స్ట్రీక్ కొనసాగించాడా.. చూద్దాం పదండి.

కథ:

నాని (నాని) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. చదువు పూర్తి చేసి ఏ పనీ చేయకుండా తిరుగుతుంటాడు. చిన్నపుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అతడిని అన్నయ్య (రాజీవ్ కనకాల) అన్నీ తానై పెంచుతాడు. ఐతే అతడి అన్నయ్య పెళ్లి చేసుకున్నాక నాని జీవితం మారిపోతుంది. వదిన జ్యోతి (భూమిక) వచ్చాక అన్నయ్యకు తనకు దూరం పెరిగిందని ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు నాని. ఇలాంటి పరిస్థితుల్లో వదిన కోసం నాని వరంగల్ కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జ్యోతి పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. ఆ పరిస్థితుల్లో నాని తన వదిన విషయంలో అపార్థాలు తొలగించుకుని ఆమెను ఆ సమస్య నుంచి ఎలా బయటపడేశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కథాకథనాలు ఓ మోస్తరుగా ఉన్నా చాలు.. మిగతాది నాని చూసుకుంటాడు. తన పెర్ఫామెన్సుతో లాక్కొచ్చేస్తాడు.. సినిమాను గట్టెక్కించేస్తాడు. ఇందుకు గత రెండు మూడేళ్లలో చాలా రుజువులు కనిపిస్తాయి. ‘ఎంసీఏ’ కూడా ఒక దశ వరకు అలా ఓ మోస్తరుగానే నడుస్తూ బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. నానికి పక్కాగా సూటయ్యే క్యారెక్టర్ ఇవ్వడంతో అతను యధావిధిగా చెలరేగిపోయాడు. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిపెట్టాడు. ఐతే ఈ కథ అతడి చుట్టూ తిరిగినంత వరకు బాగా ఎంగేజ్ చేస్తుంది కానీ.. కథలోని అసలు కాన్ ఫ్లిక్ట్ పాయింట్లోకి వెళ్లాక గాడి తప్పుతుంది.

ప్రథమార్ధం వరకు దాదాపు ఎక్కడా బోర్ కొట్టించని ‘ఎంసీఏ’.. కథ మలుపు తిరిగే దగ్గర్నుంచే పక్క దారి పడుతుంది. అక్కడి నుంచి ముందుకు కదల్లేక కదులుతుంది. ఏ కొత్తదనం లేకుండా.. ఏ మలుపులూ లేకుండా.. ఫ్లాట్ గా సాగిపోయే ద్వితీయార్ధం ‘ఎంసీఏ’కు పెద్ద మైనస్ అయిపోయింది. కొంచెం అవకాశమున్నా చెలరేగిపోయే నానికి కూడా.. రెండో అర్ధంలో చేతులు కట్టేసినట్లు అయిపోయాడు. అక్కడక్కడా అతను ‘ఎంసీఏ’ను కొంచెం పైకి లేపే ప్రయత్నం చేసినా.. పెద్దగా ఫలితం లేకపోయింది. గమ్యానికి సగం దూరం వరకు రయ్యిన దూసుకెళ్లిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’కి ఉన్నట్లుండి బ్రేకులు పడిపోవడంతో మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోయాడు.

ఎలాంటి పాత్ర ఇచ్చినా బాగానే చేసే నాని.. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలిస్తే మరింతగా చెలరేగిపోతుంటాడు. ఇక్కడ సినిమా పేరే.. మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇక అతడి నుంచి ఆశించే వినోదానికి ఢోకా ఏముంటుంది..? ప్రథమార్ధమంతా తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తూ ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాను లాక్కెళ్లిపోయాడతను. హీరో-వదిన మధ్య హేట్ రిలేషన్షిప్.. హీరో-హీరోయిన్ మధ్య లవ్ రిలేషన్షిప్ నేపథ్యంలో అల్లుకున్న సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ఎప్పుడూ 11 గంటలకు నిద్ర లేచే వాడు.. ఒక రోజు లేక లేక పొద్దున్నే లేచి సూర్యోదయాన్ని చూసి ‘‘ఎప్పుడో చిన్నపుడు చూశా’’ అంటూ నాని ఒళ్లు విరుచుకుంటూ డైలాగ్ చెబుతుంటే నవ్వుకోని ప్రేక్షకుడుండడు. తన వదిన ఇంట్లో పని మనిషిలా మారిపోయి నాని పనులు చేసే సన్నివేశాలు మంచి వినోదాన్నందిస్తాయి. హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ కొంచెం అసహజంగా అనిపించినా.. అది కూడా ఫన్నీగా సాగిపోతుంది.

పాత్రల పరిచయం.. సరదా సన్నివేశాలతో తొలి గంట వేగంగా గడిచిపోయాక దర్శకుడు కథలోని కాన్ ఫ్లిక్ట్ పాయింట్లోకి వస్తాడు. అక్కడ మొదలవుతుంది అసలు సమస్య. ‘రేసుగుర్రం’ సినిమాను గుర్తుకు తెచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుడిలో ఈ కథ ఏ ఎగ్జైట్మెంట్ కలిగించదు. ద్వితీయార్ధంలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఏమంత ఆసక్తి రేకెత్తించదు. విలన్-హీరో మధ్య ఎత్తులు పైఎత్తులు చాలా మామూలుగా అనిపిస్తాయి. పెద్ద బలగాన్ని మెయింటైన్ చేస్తూ ఒక సిటీని గడగడలాడించేసే పెద్ద విలన్.. మామూలు కుర్రాడైన హీరోను దాటి అతడి వదినను ఏమీ చేయలేకపోవడం నమ్మశక్యంగా అనిపించదు. విలన్ బ్యాచ్ అసలు ఏమీ చేయకుండానే.. హీరోను ఏమీ చేయలేం ఏమీ చేయలేం అంటుంటారు.

క్లైమాక్స్ వచ్చేవరకు తొందరపడి ఏమీ చేసేయకూడదు అన్నట్లుగా విలన్ అండ్ కో వ్యవహారం ఉంటుంది. క్లైమాక్స్ సహా కథ ఎలా సాగుతుందో ముందే ప్రేక్షకుడికి అంచనా వచ్చేయడం.. ఏదో నామమాత్రంగా సన్నివేశాలు వచ్చి పోతుండటంతో ఒక దశ దాటాక ‘ఎంసీఏ’ గ్రాఫ్ బాగా పడిపోతుంది. ఇక హీరోను హీరోయిన్.. అతడి వదిన అపార్థం చేసుకునే సన్నివేశాలు చాలా ఫోర్స్డ్ గా అనిపించడంతో ఎమోషన్ కు అవకాశమే లేకపోయింది. ప్రథమార్ధానికి బలంగా నిలిచిన వినోదం కూడా రెండో అర్ధంలో మిస్సయింది. అయినప్పటికీ నాని కొన్ని చోట్ల మెరిశాడు. చివరికి వచ్చేసరికి విలన్ పాత్ర విషయంలో కొంచెం కొత్తగా ఏదో ట్రై చేశారు కానీ.. అది కన్విన్సింగ్ గా అనిపించదు. క్లైమాక్సులో నాని తనదైన నటనతో సినిమాను పైకి లేపేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. ఐతే అతడి ప్రయత్నమే తప్ప కంటెంట్లో బలం ఏమీ కనిపించదు. నాని కోసం.. ప్రథమార్ధంలో వినోదం కోసం ‘ఎంసీఏ’పై ఒక లుక్కేయొచ్చు కానీ.. ఓవరాల్ గా అయితే ‘ఎంసీఏ’లో పెద్ద విశేషమేమీ లేదు.

నటీనటులు:

యాజ్ యూజువల్ నాని అదరగొట్టాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రను అలవోకగా చేసుకెళ్లిపోయాడు. ఈ పాత్ర కోసం అతను కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేకపోయింది. మామూలుగా ఒక పాత్రకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. కానీ ‘ఎంసీఏ’లో నాని పాత్ర విషయంలో అలాంటి అవసరమేమీ లేదు. తొలి సీన్లోనే ఆ పాత్రతో కనెక్టయిపోతాం. అంత బాగా ఈ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ని ముద్దాడే ఒక సన్నవేశం చాలు.. నాని ఎంత మంచి నటుడో చెప్పడానికి. వినోదం కోసం ఉద్దేశించిన సన్నివేశాల్లో చెలరేగిపోయాడు నాని. పట్టరాని ఆవేశాన్ని.. బాధను చూపించే పతాక సన్నివేశంలోనూ అదరగొట్టేశాడు. నాని తర్వాత ఎక్కువ మార్కులు భూమికకు పడతాయి. ఆమె పరిణతితో కూడిన నటనతో హీరో వదిన పాత్రను రక్తి కట్టించింది. ఈ పాత్ర.. భూమిక నటన సినిమాకు బలం. ‘ఫిదా’ తర్వాత సాయిపల్లవి నుంచి ఏదో ఆశిస్తే నిరాశ తప్పదు. ఆమె ప్రత్యేకత చూపించే పాత్ర కాదు ఇది. కనిపించినంతసేపూ ఆకట్టుకున్నప్పటికీ ఆమె పాత్రలో అంత స్పెషాలిటీ అయితే లేదు. పాటల్లో తనదైన శైలిలో డ్యాన్సులతో సాయిపల్లవి ఆకట్టుకుంటుంది. కానీ ఆమె స్టైలింగ్ ఏమంత బాగా లేదు. విలన్ విజయ్ వర్మ బాగా చేశాడు కానీ.. అతడి పాత్ర తేలిపోయింది. ప్రియదర్శి ఉన్నంతలో బాగానే నవ్వించాడు. రాజీవ్ కనకాల.. నరేష్.. ఆమని.. శుభలేఖ సుధాకర్.. పవిత్రా లోకేష్.. వీళ్లవి అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలు కాదు.

సాంకేతికవర్గం:

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిరాశ పరిచాడు. ఈ మధ్య కాలంలో దేవి ఇంత యావరేజ్ ఔట్ పుట్ ఇచ్చిన సినిమా మరొకటి లేదు. పాటలు ఏదో అలా నడిచిపోయాయి కానీ.. గుర్తుంచుకునేలా అయితే లేవు. నేపథ్య సంగీతం కూడా మామూలుగా అనిపిస్తుంది. ఎంసీఏ థీమ్ మ్యూజిక్ సహా.. చాలా సౌండ్స్ రొటీన్ గా అనిపిస్తాయి. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఓకే. మాటలు పర్వాలేదు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంచుకున్న కథే చాలా రొటీన్. స్క్రీన్ ప్లే కూడా మామూలుగా అనిపిస్తుంది. అతను కొత్తగా చూపించిందేమీ లేదు. ప్రథమార్ధంలో హీరో పాత్ర చుట్టూ వినోదం పండించడంలో అతను విజయవంతమయ్యాడు. కామెడీ బాగా డీల్ చేశాడు. నానిని సరిగ్గా ఉపయోగించుకున్నాడు. ద్వితీయార్ధంలో మాత్రం నిరాశ పరిచాడు.

చివరగా: మిడిల్ క్లాస్ అబ్బాయి.. మిడిల్ డ్రాప్!

రేటింగ్- 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News