వెట‌ర‌న్ నిర్మాత‌ను వ‌దులుకోని మెగాస్టార్

Update: 2021-08-26 10:30 GMT
మెగాస్టార్ చిరంజీవి-స్టార్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్ రామారావు కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 80-90వ ద‌శంకంలో ఆ క‌ల‌యిక‌ అంటే ఓ క్రేజ్. `అభిలాష‌`..`ఛాలెంజ్`.. `మ‌ర‌ణ మృదంగం`.. `రాక్ష‌సుడు` .. `స్టూవ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్` లాంటి చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ఘ‌నత ఈ జోడీకే చెల్లింది. చిరంజీవికి మెగాస్టార్ గా అన్న బిరుదును ప్ర‌ధానం చేసింది కె.ఎస్ రామారావు. ఛాలెంజ్ సినిమా టైమ్ లోనే ఈ బిరుదును ఇచ్చారు. ఆ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో చిరంజీవి స్వ‌యంగా వెల్లడించారు.

ఇంకా వెంక‌టేష్.. నాగార్జున‌.. బాల‌కృష్ణ లాంటి స్టార్ హీరోల‌తోనూ కె.ఎస్.రామారావు ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు. ఆ త‌ర్వాత కాల‌క్ర‌మేణా రామారావు గారు నిర్మాణం త‌గ్గించుకుంటూ వ‌చ్చారు. ఈ గ్యాప్ లో ఎంతో మంది కొత్త నిర్మాత‌లు ఎంట్రీ ఇవ్వ‌డం...స్టార్ నిర్మాత‌లుగా అవ‌త‌రించ‌డం జ‌రిగింది. ఇదే స‌మ‌యంలో మ‌ళ్లీ రామారావు గారు కంబ్యాక్ అయిన మునుప‌టి అంతా స్పీడ్ చూపించ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాతి కాలంలో చిరంజీవి రాజ‌కీయాల్లోకి వెళ్లిపోవ‌డం మెగా కాంపౌండ్ నుంచి కొత్త హీరోలు ఎంట్రీ ఇవ్వ‌డంతో స‌న్నివేశం మారింది. ఇదే స‌మ‌యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో తెర‌కెక్కించిన ద‌మ్ము పెద్ద ఫ్లాపైంది. మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తో కె.ఎస్ రామారావు `తేజ్ ఐల‌వ్ యూ` చిత్రాన్ని నిర్మించారు. అయితే రామ్ చ‌ర‌ణ్..అల్లు అర్జున్...వ‌రుణ్ తేజ్ లాంటి అగ్ర హీరోల‌తో ఆయ‌న‌ సినిమాలు చేయ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు మెగా యంగ్ హీరోలు డేట్లు ఇవ్వ‌లేద‌నే ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా వాట‌న్నింటికి తెర దించుతూ ఏకంగా మెస్టార్ చిరంజీవినే త‌న సినిమా లో కె.ఎస్.రామారావు ని భాగం చేసుకున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `వేదాళం` చిత్రాన్ని `భోళా శంక‌ర్` టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో యాభై శాతం పెట్టుబ‌డులు ఛాలెంజ్ నిర్మాత రామారావు తో పెట్టిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నేరుగా చిరంజీవేని ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోవాల‌ని కె.ఎస్ రామారావు గారిని కోరారుట‌. ఆ ర‌కంగా త‌న వెట‌ర‌న్ నిర్మాత‌ల‌ను వ‌దులుకోన‌ని చిరంజీవి ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ప్రారంభించిన కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ సినిమాల్లోనే న‌టిస్తున్నారు. అడ‌పాద‌డ‌పా ఇత‌ర బ్యాన‌ర్ల‌ను క‌లుపుకుని కొణిదెల బ్యాన‌ర్ ని బిల్డ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో తిరిగి వెట‌ర‌న్ నిర్మాత‌లను క‌లుపుకుని సినిమాలు చేయ‌డం అంటే ఆయ‌న స్నేహ‌స్వ‌భావానికి మంచిత‌నానికి ఇది ప్ర‌తీక అనుకోవాలి.

వెట‌ర‌న్ నిర్మాత‌లు అదృశ్యం

మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు! అనే టైప్ ఫిలింమేక‌ర్స్ ఇటీవ‌లి కాలంలో పుట్టుకొచ్చారు. అందువ‌ల్ల‌నే సినిమాల నిర్మాణం ఆపేశాన‌ని ఇంత‌కుముందు ప్ర‌ముఖ నిర్మాత `ద‌స‌రా బుల్లోడు` ఫేం కీ.శే వి.వి.రాజేంద్ర ప్ర‌సాద్ (జ‌గ‌ప‌తిబాబు తండ్రి) తుపాకి ఎక్స్ క్లూజివ్ ఇంట‌ర్వ్యూలో అన్నారు. నేటి జ‌న‌రేష‌న్ మేక‌ర్స్ ఆలోచ‌న‌లు అస్స‌లు స‌రిప‌డ‌వ‌ని నాటి నీతి నియ‌మాలు నిబంధ‌న‌లు ఆహ్లాద‌క‌ర ప‌రిస్థితి నేడు సినీనిర్మాణ రంగంలో లేద‌ని కూడా ఆయ‌న అన్నారు. వి.బి.రాజేంద్ర ప్ర‌సాద్ చివ‌రి రోజుల్లో ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానం బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించారు. ఆధ్యాత్మిక‌త‌ను అనుస‌రించారు. నేటిరోజుల్లో చాలా మంది వెట‌ర‌న్ నిర్మాత‌లు సినిమా రంగం నుంచి వైదొల‌గ‌డానికి ఇప్పుడున్న స్పీడ్ కంట్రోల్ లేని అప‌రిమిత బ‌డ్జెట్లు కార‌ణ‌మ‌య్యాయి. హీరో డామినేటెడ్ ప‌రిశ్ర‌మ‌లో మ‌నుగ‌డ సాగించ‌లేమ‌ని దాస‌రి వంటి వారు కూడా సినిమాల నిర్మాణం త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడున్న యూత్ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు మార‌లేని చాలామంది సీనియ‌ర్ నిర్మాత‌లు ప‌రిశ్ర‌మ నుంచి నిష్క్ర‌మించారు.





Tags:    

Similar News