మెగాస్టార్ కాంప్ర‌మైజ్.. మోహ‌న్ బాబుకు ఫోన్‌?

Update: 2021-10-18 04:15 GMT
`మా` అసోసియేష‌న్ ఎన్నిక‌ల వేళ ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్ర‌కాష్‌రాజ్‌.. మంచు విష్ణు ప్యానెల్‌లు పోటీప‌డ్డాయి. అయితే అంతిమంగా ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌పై మంచు విష్ణు ప్యానెల్ విజ‌యం సాధించింది. మా పీఠంపై ప్ర‌కాష్ రాజ్ కూర్చుంటార‌ని చివ‌రి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగినా అనూహ్యంగా ఫ‌లితాలు మంచు విష్ణుకు అనుకూలంగా మార‌డంతో ప్ర‌కాష్ రాజ్ త‌రుపున పోటీ చేసి గెలిచిన వారంతా మూకుమ్మ‌డిగా రాజీనామా చేశారు.

దీంతో మ‌రోసారి `మా` వార్త‌ల్లో నిలిచింది. అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగానూ ఆర్టిస్ట్ ల మ‌ధ్య విభేధాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. మంచు విష్ణు ప్ర‌మాణ స్వీక‌రానికి చిరుకు ఆహ్వానం లేక‌పోవ‌డం.. మెగా క్యాంప్ నుంచి ఎవ‌రూ అక్క‌డ క‌నిపిపంచ‌కపోవ‌డంతో `మా` వివిదం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. `పెళ్లి సంద‌డి` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో చిరంజీవి `మా` వివాదంపై స్పందించ‌డం.. దానికి కౌంట‌ర్ గా త‌మ‌ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మోహ‌న్ బాబు వ్యాఖ్య‌లు చేయ‌డంతో మెగా.. మంచుల మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌ని ప్ర‌చారం మొద‌లైంది.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి .. త‌న స్నేహితుడు మోహ‌న్ బాబుకు ఫోన్ చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. `మా` ఎన్నిక‌ల్లో తాను ఎవ్వ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని చిరు ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబుకు స్ప‌ష్టం చేసిన‌ట్టుగా తెలిసింది. అయితే అకార‌ణంగానే త‌న పేరుని బ‌య‌ట‌పెట్టార‌ని చెప్పుకొచ్చార‌ట‌. అంతే కాకుండా త‌న మిత్రుడు మోహ‌న్ బాబుతో త‌న అనుబంధం ఎప్ప‌టిలాగే కొన‌సాగుతుంద‌ని చిరు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసిన‌ట్టుగా చెబుతున్నారు.

చిరు క్లారిటీ ఇవ్వ‌డంతో మోహ‌న్ బాబు కూడా సానుకూలంగా స్పందించిన‌ట్టుగా తెలిసింది. అంద‌రం క‌లిసి క‌ట్టుగా వుండాల‌న్న‌దే త‌మ అభిమ‌త‌మ‌ని మోహ‌న్ బాబు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశార‌ట‌. ఇప్పుడిది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నిక‌ల వేళ వాడీ వేడీగా విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు వినిపించడం. తాజాగా ఆ వివాదం స‌మ‌సిపోయింద‌ని ఒక్క‌టి కావ‌డంతో మ‌ధ్య‌లో ప్ర‌కాష్ రాజ్ పెద్ద జోక‌ర్ గా మారిపోయాడ‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయినా ప్రెస్టేజ్ కి పోయి కొట్టుకునేంత గొప్ప ప‌ద‌వా ఇదేమైనా? ఏదో కుటుంబాల మ‌ధ్య వార్ గా మాత్ర‌మే దీనిని చూడాలి.. అంటూ ప‌లువురు ఆర్టిస్టులు గుస‌గుస‌లాడ‌డం చూస్తున్న‌దే. ఇక మా అధ్య‌క్ష ప‌ద‌వి వ‌ల్ల ఒరిగేదేమీ ఉండ‌ద‌ని ఇప్ప‌టికే గ‌త అధ్య‌క్షులైన రాజేంద్ర ప్ర‌సాద్ - ముర‌ళీ మోహ‌న్ వంటి వారు చెప్పుకొచ్చారు.

MAA ని ఐదు సార్లు పాలించిన ఆయ‌న ఆనుభ‌వ పాఠం!

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అసోసియేష‌న్ కి చిరంజీవి - కృష్ణ‌- నాగ‌బాబు- రాజేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రులు అధ్య‌క్షులుగా కొన‌సాగారు. ఆ త‌ర్వాత ముర‌ళీమోహ‌న్ ఏకంగా ఐదు సీజ‌న్ల‌కు అధ్య‌క్ష ప‌ద‌విలోనే ఉన్నారు. 5సార్లు అధ్యక్షులు గా.. 3 సార్లు జనరల్ సెక్రటరీగా ముర‌ళీమోహ‌న్ ప‌ద‌వులు చేప‌ట్టి ప‌ని చేసారు. జనరల్‌ సెక్రటరీగా ఆయ‌న చిరు-కృష్ణ అధ్య‌క్షులుగా ఉన్న స‌మయంలో ప‌ని చేశారు. 1993 నుంచి 99 వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కొన‌సాగారు. అధ్యక్షులుగా..1999-2015 మ‌ధ్య ఐదు సీజ‌న్ల‌కు ఆయ‌నే పాలించారు.

అయితే మూవీ ఆర్టిస్టుల ఎన్నిక‌ల్లో ర‌భ‌స‌పై ఆయ‌నేమంటున్నారు. ఒక‌రిపై ఒక‌రు విద్వేషాన్ని కోపాన్ని క‌లిగి ఉన్నారు. మీడియా మీటింగుల్లో బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నారు. ఒకే కుటుంబంలా క‌లిసి ఉంటాం అంటూనే క‌క్ష‌లు సాధింపుల‌కు తెర తీస్తూ జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ లా మార్చేశారు. ఇదంతా అవ‌స‌ర‌మా? అని ముర‌ళీమోహ‌న్ ని ప్ర‌శ్నిస్తే.. నేటిత‌రం ఔత్సాహికుల హ‌డావుడి ఇది అంటూ న‌వ్వేశారు. ఎవ‌రు గెలిచినా అంద‌రూ మా కు సేవ చేయాల‌ని పేద క‌ళాకారుల‌కు ఉపాధిని క‌ల్పిస్తూ తిండికి లోటు రాకుండా చూడాల‌ని ఆరోగ్య కార్డుల‌ను అంద‌జేయాల‌ని కూడా ముర‌ళీ మోహన్ సూచించారు. గొడ‌వ‌ల్లేకుండా క‌లిసి మెలిసి ప‌ని చేయాల‌ని ఒక సీనియ‌ర్ గా సూచించారు.

`మా`కు సొంత భ‌వంతి ఎలా సాధ్యం?

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వేళ‌ వివాదాల‌న్నీ `మా సొంత భ‌వంతి` నిర్మాణం చుట్టూనే తిరిగిన‌ సంగ‌తి తెలిసిందే. తెలుగు ఆర్టిస్టుల సంఘం ద‌శాబ్ధాల పాటు మ‌నుగ‌డ సాగిస్తున్నా.. దాదాపు 950 మంది స‌భ్యుల‌తో సౌత్ లోనే అతి పెద్ద అసోసియేష‌న్ గా వెలిగిపోతున్నా కానీ `మా`కు సొంత భ‌వంతి లేక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముర‌ళీ మోహ‌న్ తేదేపా హ‌యాంలోనే ట్రై చేసి విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిన‌దే. అయితే ఇన్నేళ్ల‌లో మా అసోసియేష‌న్ కి సొంత భ‌వంతి కోసం ప్ర‌య‌త్నాలు సాగ‌లేదా? అంటే.. ప్ర‌తిసారీ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నా ఫెయిల‌య్యామ‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అంగీక‌రించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలోనే ముర‌ళీమోహ‌న్ ప్ర‌య‌త్నించారు. కానీ ప‌న‌వ్వ‌లేదు. ఆ త‌ర్వాత వైయ‌స్సార్ ప్ర‌భుత్వాన్ని ముర‌ళీమోహ‌న్ మా భ‌వంతి కోసం ఎక‌రం భూమి అడిగారు. కానీ కాంగ్రెస్ డోర్స్ మూసేసింద‌ని నాగ‌బాబు తెలిపారు. కానీ ముర‌ళీమోహ‌న్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి ఉంటే అయ్యేద‌ని కూడా అన్నారు.

నిజానికి ఏపీ తెలంగాణ డివైడ్ అనే అంశం కూడా మా సొంత భ‌వంతి నిర్మాణం ఆగిపోవ‌డానికి కార‌ణ‌మ‌ని నాగ‌బాబు న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో తాము భ‌వంతి నిర్మాణం కంటే వెల్ఫేర్ కార్య‌క్ర‌మాల వైపు మొగ్గు చూపాని తెలిపారు. తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌ హ‌యాంలోనూ మా సొంత భ‌వంతి కోసం ప్ర‌య‌త్నించినా ప‌ని కాలేద‌ని తెలిపారు. మా సొంత భ‌వంతి నిర్మాణం విష‌యంలో ప్ర‌కాష్ రాజ్.. మంచు విష్ణు ఎవ‌రికి వారు పూర్తి క్లారిటీతో ఉన్నామ‌ని ఎన్నిక‌ల వేళ‌ తెలిపారు. స్థ‌ల సేక‌ర‌ణ స‌హా ప్ర‌తిదీ ఏం చేయాలో మీడియా మీటింగుల్లో ఆ ఇద్దరూ వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ఇప్పుడు మంచు విష్ణు అధ్య‌క్షుడ‌య్యారు కాబ‌ట్టి `మా` సొంత భ‌వంతి నిర్మాణ బాధ్య‌త ఆయ‌న‌దే. ఆర్టిస్టుల నుంచి డొనేష‌న్ల అవ‌స‌రం లేకుండా త‌న సొంత డ‌బ్బుతోనే `మా` భ‌వంతిని నిర్మిస్తాన‌ని ప్రామిస్ చేశారు. ఇక వివాదాల్ని మ‌రిచి స్థ‌ల సేక‌ర‌ణ‌లో ప్ర‌కాష్ రాజ్ స్వ‌యంగా ప్ర‌భుత్వాల‌తో మాట్లాడి ఏదైనా సాయం చేస్తారేమో చూడాలి.



Tags:    

Similar News