మెగాస్టార్ గేరు మార్చాల్సిందేనా?

Update: 2022-08-23 14:30 GMT
మెగాస్టార్ విష‌యంలో ఫ్యాన్స్ అసంతృప్తిగా వున్నారా?.. ఆయ‌న సినిమాల లైన‌ప్‌ విష‌యంలో తీవ్ర ఆవేద‌న‌కు గుర‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. చిరుకు అభిమాన గ‌ణం భారీ స్థాయిలో ఏర్ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న చేసిన సినిమాలే. `ఖైదీ`తో చిరు స్టార్ డ‌మ్ ని సొంతం చేస‌కున్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఏ సినిమా చేసినా ఫ్యాన్స్ కోస‌మే చేస్తూ వారిని ఆనంద‌ప‌ర‌చాల‌న్న ఆలోచ‌న‌తో సినిమాలు చేస్తూ వ‌చ్చారు.

డ్యాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ హీరో మేన‌రిజ‌మ్స్ లోనూ విప్లవాత్మ‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. అభిమానుల‌ని ఆనంద‌ప‌రిచారు. చిరు త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేరు అనే స్థాయిలో త‌న పాత్ర‌ల‌ని ర‌క్తిక‌ట్టించారు. సీరియ‌స్ గా వుంటూనే హీరో కూడా కామెడీని సంద‌ర్భాను సారం ప‌డించ‌గ‌ల‌డ‌ని, అందుకు క‌మెడీయ‌న్ అవ‌స‌రం లేద‌ని కూడా నిరూపించ త‌నదై మార్కు పాత్ర‌ల‌తో కామెడీని కూడా ప‌ట్టించి త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు.

విల‌క్ష‌ణ‌మైన త‌న స్టైల్స్‌, మేన‌రిజ‌మ్స్ తో వెండితెర‌ని ద‌శాబ్దాలుగా ఏలుతూ తిరుగులేని మెగాస్టార్ అనిపించుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్ లో వుండ‌గానే క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన ఫ్యాన్స్ కు షాకిచ్చారు. అయితే ప‌దేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ వెండితెర‌పై మెరిసినా ఆ క్రేజ్‌, గ్రేస్ బాసులో ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని `ఖైదీ నంబ‌ర్‌150` బ్లాక్ బ‌స్ట‌ర్ తో నిరూపించారు. కానీ ప్ర‌స్తుతం త‌న పంథాకు భిన్నంగా సినిమాలు చేస్తుండ‌టం ఫ్యాన్స్ ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

చిరు చేస్తున్న సినిమాలు, ఆయ‌న లైన‌ప్ చూసి ఫ్యాన్స్ బేజార‌వుతున్నార‌ట‌. `ఖైదీ నంబ‌ర్‌150` మూవీతో ప‌దేళ్ల విరామం త‌రువాత రీఎంట్రీ ఇచ్చిన చిరు ఆ త‌రువాత నుంచి మాత్రం త‌న‌కు త‌గ్గ సినిమాలు చేయ‌డం లేద‌ని, ఫ్యాన్స్ ని మెప్పించే సినిమాలు అస్స‌లు చేయ‌డం లేద‌ని ఫ్యాన్స్ వాపోతున్నార‌ట‌. వారి భ‌యానికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలిచిన మూవీ `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో రూపొదిన ఈ మూవీలో మెగాస్టార్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టించిన విష‌యం తెలిసిందే.

అయినా స‌రే ఈ మూవీ ఏ విష‌యంలో అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చ‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి షాకిచ్చింది. ఈ మూవీ సోష‌ల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చాలా వ‌ర‌కు ట్రోల‌ర్స్ ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ సీన్ ల‌పై, గ్రాఫిక్స్ పై కూడా భీభ‌త్సంగా ట్రోల్ చేశారు. దీంతో ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. ఎలాంటెలాంటి సినిమాలు చేసిన చిరు ఇప్ప‌డు ఇలాంటి సినిమాలు చేయ‌డం ఏంట‌ని తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. అంతే కాకుండా చిరు పుట్టిన రోజు విడుద‌ల చేసిన `గాడ్ ఫాద‌ర్‌` టీజ‌ర్‌, భోళా శంక‌ర్ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ల‌కు ఫ్యాన్స్ నుంచి స్పంద‌న క‌రువైంది.

 దీనికి తోడు త‌మ‌న్ `గాడ్ ఫాద‌ర్‌` నేప‌థ్య సంగీతాన్ని కాపీ చేశాడంటూ ట్రోల్ మొద‌ల‌వ్వ‌డంతో చిరు ఫ్యాన్స్ ఆయ‌న లైన‌ప్ పై  మ‌రింత‌గా కంగారు ప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా చిరు ఫ్యాన్స్ ఆవేద‌న‌ని దృష్టిలో పెట్టుకుని త‌దుప‌రి సినిమాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిద‌ని, ఇప్ప‌టికైనా మెగాస్టార్ సినిమాల ఎంపిక విష‌యంలో గేర్ మార్చాల్సిందేన‌ని చెబుతున్నారు. మ‌ని చిరు ఫ్యాన్స్ ఆవేద‌న‌ని వింటారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News