'మాటే మంత్రము' అంటున్న మేఘా - రాహుల్..!

Update: 2022-06-07 07:14 GMT
'ఈ మాయ పేరేమిటో' అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ తో కలిసి రాహుల్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు.

నేడు రాహుల్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీ టైటిల్‌ ను మేకర్స్ ప్రకటించారు. ఈ అందమైన ప్రేమకథా చిత్రానికి ''మాటే మంత్రము'' అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్ల ఫేసులు కనిపించకుండా బ్యాక్ సైడ్ లుక్స్ తో ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

'సీతాకోకచిలుక' చిత్రంలోని 'మాటే మంత్రము.. మనసే బంధమూ' అనే పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అలాంటి క్లాసిక్ సాంగ్ లోని 'మాటే మంత్రము' అనే లైన్ ను మేఘా ఆకాష్ - రాహుల్ విజయ్ ల చిత్రానికి టైటిల్ గా పెట్టారు.

అభిమన్యు బద్దిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'డియర్ మేఘ' ఫేమ్ సుశాంత్ రెడ్డి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు కథ అందించారు. మేఘా తల్లి బిందు ఆకాష్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ''మాటే మంత్రము'' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ "మా హీరో రాహుల్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను ప్రకటిస్తున్నాము. 'మాటే మంత్రము' ఈ కథకు సరైన టైటిల్. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను.. గోవాలో రెండవ షెడ్యూల్ పూర్తి చేసాం. మొత్తం 90% చిత్రీకరణను పూర్తి చేసాము. గోవా బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ సినిమా వినోదాత్మకంగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది." అని తెలిపారు.

''మాటే మంత్రము'' చిత్రంలో రాహుల్ విజయ్ - మేఘా ఆకాష్ లతో పాటుగా రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ - అభయ్ బేతిగంటి - వైవా హర్ష - బిగ్ బాస్ సిరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కోట ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు ట్రిప్పీఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్లపై ఎ. సుశాంత్ రెడ్డి - అభిషేక్ కోట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హరి గౌర ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కె.వి. రమణ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 'మాటే మంత్రము' సినిమా రాహుల్ విజయ్ తో పాటుగా తల్లీ కూతుర్లు బిందు ఆకాష్ - మేఘా ఆకాష్ లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News