ఆయన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఆడదని చెప్పాడు

Update: 2016-01-11 22:30 GMT
మేర్లపాక గాంధీ.. ఈ పేరు వినగానే ఆటోమేటిగ్గా మేర్లపాక మురళి గుర్తుకొచ్చేస్తారు. రొమాంటిక్ కథలకు ఈ పేరు బాగా ఫేమస్. తండ్రి ద్వారా సాహిత్యం మీద మక్కువ పెంచుకుని.. కథలు రాయడం అలవాటై, సినీ దర్శకుడిగా మారాడు గాంధీ. ఐతే తండ్రి బాటలో రొమాంటిక్ సినిమాలు తీయకుండా.. ఎంటర్ టైనర్స్ చేస్తున్నాడు గాంధీ. తొలి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మంచి ఎంటర్ టైనర్ అనిపించుకోగా.. రెండో సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ కూడా ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది. ఐతే తన తండ్రి మాత్రం తన నుంచి రొమాంటిక్ సినిమాలు ఆశిస్తున్నారని చెప్పాడు గాంధీ. ‘వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్’ సినిమా మీద కూడా తన తండ్రికి నమ్మకం లేదని, అది ఆడదని ఆయన అంచనా వేశారని గాంధీ చెప్పడం విశేషం.

‘‘మా నాన్నగారు నన్ను రొమాంటిక్ కథలే రాయమంటారు. నాకేమో ఎంటర్ టైనర్స్ ఇష్టం. ఈ విషయం మీద ఇద్దరం వాదించుకుంటూ ఉంటాం. అయినా ఆయనలా రొమాంటిగ్గా నేను రాయలేను. నా తొలి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మీదే ఆయనకు నమ్మకం లేదు. ఈ సినిమా ఆడదని చెప్పారు కూడా. ఆ సినిమా కోసం మా ఊర్లో కట్టిన బేనర్లు కూడా తీసేయమన్నారు. కానీ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఆడింది. ఆ సినిమా చూసి ఆయన చాలా సంతోషించారు’’ అని గాంధీ చెప్పాడు. కాలేజీ రోజుల్లో తానొక సీరియస్ షార్ట్ ఫిలిం తీశానని.. కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదని, కానీ ‘కర్మరా దేవుడా’ అనే పేరుతో ఓ సరదా షార్ట్ ఫిలిం తీస్తే అది అందరికీ తెగ నచ్చేసిందని, ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ కోరుకుంటున్నారని అప్పుడే తనకర్థమై.. తన దారి మార్చుకున్నానని గాంధీ తెలిపాడు.
Tags:    

Similar News