అవి నా వల్ల కాదనేసిన మిక్కీ

Update: 2018-05-01 05:37 GMT
ప్రతి సంగీత దర్శకుడికీ ఒక ముద్ర ఉంటుంది. ఫలానా తరహా పాటలైతే బాగా చేస్తాడని.. ఫలానా పాటల్లో కొంచెం వీక్ అని అభిప్రాయం కలుగుతుంది. మిక్కీ జే మేయర్ విషయానికి వస్తే అతను మెలోడీల్లో కింగ్ అని అందరికీ తెలుసు. కానీ మాస్ మసాలా పాటలు చేయడంలో అతడి బలహీనత గురించీ తెలుసు. అందుకే కెరీర్లో చాలా వరకు క్లాస్ టచ్ ఉన్న సినిమాలే చేశాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి ఒకట్రెండు మాస్ సినిమాలు ట్రై చేశాడు కానీ.. వాటికి తగ్గ ఔట్ పుట్ ఇవ్వలేకపోయాడు. ఐతే తన బలహీనత గురించి అంగీకరించడానికి అతనేమీ మొహమాట పడట్లేదు.

‘‘మెలోడీలే నా బలం. వాటిలోనే నా ప్రత్యేకత చూపించగలను. అందుకే ఆ తరహా పాటలున్న సినిమాలకే ఎక్కువగా పని చేస్తాను. ఇందులో ప్రయోగాలు కూడా చేస్తాను. కానీ మాస్ ను అలరించే పాటలు నేను చేయలేను. అది నా బలహీనత. వాటి విషయంలో నేను చేయలేను. నాకు అసలు కమర్షియల్ సినిమాలు అంతగా నచ్చవు. అందుకే నేను వాటిని చేయను. వరుసబెట్టి సినిమాలు చేసేయాలన్న ఆలోచన కూడా లేదు. అంత బిజీగా ఉండటం కూడా నచ్చదు. అందుకే కమర్షియల్ సినిమాల వెనుక పరుగెత్తకుండా నాకు నచ్చిన.. నప్పే సినిమాలే చేస్తుంటాను’’ అని మిక్కీ అన్నాడు.

ఇక తన కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ‘హ్యాపీ డేస్’ తరహా సినిమా ఇంకోటి పడకపోవడంపై మిక్కీ స్పందిస్తూ.. ‘‘అలాంటి సినిమాలు కెరీర్లో ఒక్కసారే వస్తాయి. నా గురించి ఎవరు మాట్లాడినా ఆ సినిమా పేరే ఎత్తుతారు. కానీ ప్రతి సినిమా ‘హ్యాపీ డేస్’ అవ్వలేదు కదా. ఐతే ‘మహానటి’ అలాంటి ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని ఆశిస్తున్నా. ఈ చిత్రం కోసం ఏడాదిన్నర కష్టపడ్డాను’’ అని చెప్పాడు.
Tags:    

Similar News