మినీ రివ్యూ: '777 చార్లీ'

Update: 2022-06-11 04:07 GMT
'అతడే శ్రీమన్నారాయణ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన తాజా చిత్రం ''777 చార్లీ''. కిరణ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి సమర్పించారు. టీజర్ - ట్రైలర్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో శుక్రవారం (జూన్ 10) థియేటర్లలో విడుదల చేశారు.

కథ విషయానికొస్తే.. చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు చెల్లిని కోల్పోయిన ధర్మ (రక్షిత్ శెట్టి) అనాథగా పెరుగుతాడు. ఇల్లు ఫ్యాక్టరీ తప్ప మరో లోకం లేకుండా ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అలాంటి ధర్మ లైఫ్ లోకి సడన్ గా ఓ డాగ్ ఎంట్రీ ఇస్తుంది. అప్పటి వరకు ఒంటరిగా బతికిన అతను.. దానితో ఎమోషనల్ గా బాగా దగ్గరవుతాడు. తనకు ఇష్తమైన చార్లీ చాప్లిన్ పేరును దానికి పెడతాడు. అయితే ఓ రోజు చార్లీకి సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. చార్లీ గురించి ధర్మ తెలుసుకున్న విషయమేంటి? చార్లీ రాకతో అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ధర్మ-చార్లీ జర్నీ ఎలా సాగింది? ఇద్దరు కలిసి ఏం చేశారు? అనేదే '777 చార్లీ' కథాంశం.

మనుషులకి జంతువులకి మధ్య ఎమోషనల్ బాండింగ్ ని తెర మీద ఆవిష్కరించే సినిమాలు ఎప్పుడూ ఒకరకమైన భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. అందులోనూ మనుషులకి అత్యంత విశ్వాసపాత్ర జీవి డాగ్ (శునకం) మీద సినిమా అంటే అవి మరింత బలంగా ఉంటాయి. ఇప్పుడు '777 చార్లీ' సినిమా కూడా అదే కోవకు చెందింది. చార్లీ - ధర్మల మధ్య బ్యూటిఫుల్ ఎమోషన్స్ అందరినీ భావోద్వేగానికి గురి చేస్తాయి. సినిమాలో పెద్దగా ట్విస్టులు ఏమీ లేకుండానే.. ప్రతీ సన్నివేశాన్ని కూడా ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

సినిమా మొత్తాన్ని హీరో రక్షిత్ శెట్టి తన భుజస్కంధాలపై మోశాడు. ఎంత గొప్ప యాక్టర్ అయినా తన ఎమోషన్స్ ను ఒక నోరులేని జీవితో కలిసి పండించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో రక్షిత్ ని మెచ్చుకొని తీరాల్సిందే. ఎంత మంచి చేసుకున్నా, ట్రైనింగ్ ఇచ్చినా ఒక డాగ్ కెమెరా ముందు చెప్పినట్లుగా వినాలన్నా.. మనకు నచ్చినట్లు చేయాలన్నా చాలా కష్టం. టీమ్ పాటు చార్లీతో కుస్తీ పడుతూ నటించిన రక్షిత్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే. సెన్సిబుల్ ఎమోషన్స్ ని హృదయానికి హత్తుకునేలా కనబరిచినందుకు.. తన పాత్రలోని షేడ్స్ ని బాగా చేసిపండించినందుకు.. అసలు ఒక కుక్కతో కలిసి నటించడాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నందుకు రక్షిత్ ను అభినందించాల్సిందే.

ఇక విలక్షణ నటుడు బాబీ సింహ కాసేపు కనిపించినా.. ఉన్నంతలో మంచి ఎమోషనల్ పెర్ఫామెన్స్ ని అందించాడు. చిన్న పాత్ర అయినప్పటికీ హీరోయిన్ సంగీత సింగేరి ఆకట్టుకుంది. పెట్ డాక్టర్ గా రాజ్ బి శెట్టి తన కామెడీ టైమింగ్ తో అలరించాడు.

సాంకేతిక వర్గం విషయానికొస్తే.. ఇలాంటి ఒక సబ్జెక్ట్ అనుకుని రియల్ డాగ్ తో సినిమా చేయాలని ముందుకు వచ్చిన దర్శకుడు కిరణ్ రాజ్ ను మెచ్చుకొని తీరాలి. సినిమాలా కాకుండా ఒక నిజ జీవిత ఘటన మన కళ్ళ ముందే జరిగినట్టు చూపించడానికి డైరెక్టర్ తో పాటుగా అతని మొత్తం టీమ్ కష్టం తెర మీద కనిపిస్తుంది. ఎమోషన్స్ తో పాటుగా ఇతర అంశాలు కూడా ఆకట్టుకునే విధంగా రాసుకొని ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో. స్క్రీన్ ప్లే విషయంలో కాస్త నెమ్మదించినా.. ఓవరాల్ గా దర్శకుడిగా మాత్రం తన మార్క్ చూపాడు కిరణ్ రాజ్.

సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాజెక్ట్ ను ప్రెజెంట్ చేయడానికి ముందుకు వచ్చిందంటేనే నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయనేది అర్థం అవుతుంది. అలాగే సంగీత దర్శకుడు నోబిన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. తెలుగు రచయిత విజయ్ కుమార్ డైలాగ్స్ బాగున్నాయి.

మొత్తం మీద "777 చార్లీ" సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. కేవలం జంతు ప్రేమికులనే కాకుండా.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని చెప్పచ్చు. డాగ్ లేదా మరేదైనా జీవులను పెంచుకునే వారికైతే ఈ సినిమా ఖచ్చితంగా భావిద్వేగానికి గురి చేస్తుంది. చిన్న చిన్న లోపాలు - లాజిక్స్ పక్కన పెడితే 'చార్లీ' తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా.
Tags:    

Similar News