సూర్య సినిమాలో మోహన్ బాబు?

Update: 2018-08-30 01:30 GMT
తెలుగు సినీ చరిత్రలోనే అద్భుతమైన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. 500కు పైగా సినిమాల్లో ఎన్నో అద్భుతమైన.. విలక్షణమైన పాత్రలతో మెప్పించారాయన. హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పాత్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఇంత గొప్ప నటుడిని ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ సరిగా ఉపయోగించుకోలేకపోతోంది. ఈ విషయంలో సమస్య మోహన్ బాబు వైపు నుంచి కూడా ఉంది. ఆయనే స్వయంగా సినిమాలు తగ్గించుకున్నారు. ఎప్పుడో ఒకసారి సొంత బేనర్లో సినిమా చేస్తున్నారు. కానీ వాటి ఎంపిక సరిగా ఉండట్లేదు. ఈ ఏడాది మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రి’ అనే సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత కలెక్షన్ కింగ్ కొత్త సినిమా ఏదీ మొదలు పెట్టలేదు. ఐతే తాజాగా ఆయన ఓ తమిళ చిత్రం అంగీకరించారని తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరో సూర్య నటించే కొత్త సినిమాలో మోహన్ బాబు నెగెటివ్ రోల్ చేస్తారని సమాచారం. ‘గురు’ సినిమాతో సత్తా చాటుకున్న సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుందట. సూర్య-సుధ కొంగర కాంబినేషన్ గురించి ఇంతకుముందే మీడియాలో వార్తలొచ్చాయి. సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడా అతడి సినిమాలు భారీ స్థాయిలో రిలీజవుతాయి. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో ఒక పాత్ర చేయిస్తే సినిమాకు బాగా కలిసొస్తుందని.. వెయిట్ పెరుగుతుందని సుధ భావించిందట. సుధ తెలుగుమ్మాయే అన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె కృష్ణభగవాన్ ప్ధాన పాత్రలో ఒక చిన్న సినిమా కూడా తీసింది. దాని గురించి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ‘ఇరుదు సుట్రు’తో సత్తా చాటుకుంది. దాన్నే తెలుగులో ‘గురు’గా రీమేక్ చేసింది. సూర్య-మోహన్ బాబు నిజంగానే కలిసి నటించేట్లయితే అది సూపర్ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News