అరువు కథ.. అరడజను మంది రైటర్లు

Update: 2018-02-04 07:19 GMT
టాలీవుడ్ గర్వించదగ్గన నటుల్లో మోహన్ బాబు ఒకరు. హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఎన్నో రకాల పాత్రలతో ఆయన అలరించారు. ఏకంగా 560కి పైగా సినిమాలు చేశారు. ఐతే పాతికేళ్ల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన ఆయన.. గత పది పదిహేనేళ్లలో మాత్రం బాగా జోరు తగ్గించేశారు. ఎప్పుడో కానీ ముఖానికి రంగేసుకోవట్లేదు. చివరగా ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమాలో నటించారాయన. మళ్లీ రెండేళ్లకు పైగా విరామం తీసుకుని ఇప్పుడు ‘గాయత్రి’తో వస్తున్నారు.

మరి మోహన్ బాబును మళ్లీ నటన వైపు మళ్లించిన ఈ సినిమాలో ఏం ప్రత్యేకత ఉందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే మోహన్ బాబును కదిలించింది తెలుగు కథ కాదట. ‘గాయత్రి’ ఒక రీమేక్ మూవీ అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఐతే ఆ సినిమా ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. అరువు తెచ్చుకున్న ఈ కథలో చాలామంది రైటర్ల హ్యాండ్ ఉందట.

బేసిగ్గా డైమండ్ రత్నబాబు ఈ స్క్రిప్టును డెవలప్ చేశాడట. తర్వాత మదన్ లైన్లోకి వచ్చాడు. స్వయంగా మోహన్ బాబు కూడా స్క్రీన్ ప్లే అందించగా.. సీనియర్ రైటర్లు పరుచూరి బ్రదర్స్ కూడా తమ వంతుగా రచనా సహకారం అందించారట. వీళ్లే కాక లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ లో పని చేసే కొందరు దర్శకులు సైతం ఈ స్క్రిప్టుకు సాయం అందించారట. అందరూ కలిసి ఒరిజినల్ కథను చాలా వరకు మార్చేసి తెలుగు నేటివిటీకి.. మోహన్ బాబు ఇమేజ్ కు తగ్గట్లుగా స్క్రిప్టు తీర్చిదిద్దారట. మరి ఇంతమంది కలిసి వడ్డించే ‘గాయత్రి’ విందు ప్రేక్షకులకు ఏమాత్రం రుచిస్తుందో చూడాలి.
Tags:    

Similar News