ఒక్క సినిమాతో నిర్మాతలను గట్టిగా పిండుకోవడం ఎలా??

Update: 2020-04-02 06:30 GMT
ఆయనో పెద్ద స్టార్ హీరో. ఒక క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. అది కూడా ఒకటిన్నర ఏడాది డిలే అయిన తర్వాతే పట్టాలెక్కింది. నిజానికి ఈ సినిమాను డైరెక్టర్ గారి స్నేహితుడే సోలోగా నిర్మించాల్సి ఉంది. అయితే హీరో గారి కుమారుడు రంగప్రవేశం చేయడంతో ఈ ప్రాజెక్టు  కాస్త జాయింట్ వెంచర్ అయి కూర్చుంది. అలా అని స్టార్ హీరో కుమారుడు పెట్టుబడి పెడతాడా అంటే ఆ ఒక్కటి అడగొద్దు.

ఈ సినిమాలో అసలు హీరో గారి రెమ్యూనరేషన్ 35 కోట్లు.  హీరో గారి కుమారుడు కం నిర్మాత ప్రత్యేక పాత్రలో నటించినందుకుగానూ ఆయన గారికి మరో పాతిక కోట్లు ముట్టజెప్పాలి. ఈ రెండు రెమ్యూనరేషన్లు కలిసి 60 కోట్లుగా లెక్క తేలింది. ఈ 60 కోట్లు కాకుండా సినిమా బడ్జెట్ అంతా అసలు నిర్మాతే పెట్టుకోవాలి. హీరో గారి కుమారుడు ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాకు వచ్చిన లాభాల్లో మాత్రం నిర్మాత కార్డు వేసుకున్నందుకు 50 శాతం వాటా ఉంటుంది.

ఈ లెక్కన చూస్తే తండ్రి కుమారుల పారితోషికంతో పాటు లాభాల్లో 50 శాతం వాటా.. అది కూడా ఏమాత్రం రిస్క్ లేకుండా.. ఇలాంటి జాక్ పాట్ ఆఫర్ అందరికీ దక్కదు అనే విషయం స్పష్టం. దీంతో డైరెక్టర్ గారు.. ఆయన స్నేహితుడు అయిన నిర్మాత మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్నారట. ఎలాగూ ప్రాజెక్టుకు ఒప్పుకున్నారు కాబట్టి మధ్యలో వదిలి పెట్టలేరు.. అయితే గట్టిగా అప్ సెట్ అయ్యారని మాత్రం సమాచారం. పైకి పెద్దపెద్ద మాటలు చెప్తూ లోకానికి ఆదర్శం అన్నట్టుగా ప్రవర్తించే సదరు హీరో గారు ఇలా చేయడం ఏమీ బాగోలేదు అని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.  ఈ విషయం ఆయనకు అర్ధం అవుతుందో లేదో.
Tags:    

Similar News