అడ్వాన్స్ బుకింగ్స్ లో 'మేజర్' డామినేషన్..!

Update: 2022-05-30 16:30 GMT
26/11 ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు అర్పించిన వీరజవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ''మేజర్''. వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ టైటిల్ రోల్  పోషించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

''మేజర్'' చిత్రాన్ని తెలుగు హిందీ మలయాళ భాషల్లో జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రివ్యూలు ప్రదర్శించగా.. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వేయనున్న ప్రీమియర్ షోల టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి.

ఈరోజు సోమవారం నుంచి అన్ని ఏరియాలలో ఆన్ లైన్ టికెట్స్ ఓపెన్ అవ్వగా.. బుకింగ్స్ తెరుచుకున్న కొద్ది నిమిషాల్లోనే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ లో కనిపిస్తున్నాయి. 'మేజర్' సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడం.. టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

'మేజర్' చిత్రాన్ని తెలంగాణలో సింగిల్ స్క్రీన్ లలో రూ.150 - మల్టీఫ్లెక్స్ లలో రూ.195 గా టికెట్ రేట్లతో ప్రదర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్ లలో రూ.147 - మల్టీఫ్లెక్స్ లలో రూ.177 గా టికెట్ ధరలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో GST తో కలిపే ఈ రేట్లకు ఫిక్స్ చేయడం గమనార్హం. ఇటీవల విడుదలైన సినిమాల రేట్లతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ అనే చెప్పాలి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా ఉన్న కారణంగానూ 'మేజర్' సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయిందని చెప్పాలి. ఇప్పటి వరకు తన సినిమాలకు మాత్రమే ప్రొడ్యూసర్ గా ఉన్న మహేష్.. తొలిసారిగా బయటి హీరోతో సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం శేష్ తో కలిసి ఎన్నడూ లేని విధంగా ప్రచారం కూడా చేస్తున్నారు.

'మేజర్' సినిమా ప్రచారంలో భాగంగా మహేశ్ బాబు ఓ థియేటర్ ముందు క్యూలో నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో శేష్ మరియు యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎమ్ తో కలిసి తమ సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేశారు మహేష్.

నిహారిక సినిమా టికెట్ కోసం లైన్లో నిలబడగా మధ్యలోకి అడివి శేష్ రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఈలోపు మహేష్ వచ్చి క్యూలో వారి ముందు నిలబడటంతో.. నిహారిక సర్ప్రైజ్ అవుతుంది. 'మా స్నేహితులను కూడా పిలవొచ్చా' అని మహేశ్ అడగ్గానే ఓకే అంటుంది. దాంతో లైన్ పెరుగుతుంది.

ఫోన్ నంబరు అడిగేలోపు మహేశ్ వెళ్లిపోవడంతో శేష్ వైపు చూస్తూ నిహారిక అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ లేనిది మహేశ్ ఇలా టికెట్ల కోసం థియేటర్ వద్ద లైన్ లో నిలబడినట్లు 'మేజర్' ప్రచారం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

'మేజర్' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో శోభిత ధూళిపాళ్ల - సయీ మంజ్రేకర్ - ప్రకాశ్ రాజ్ - రేవతి - మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏ ప్లస్ ఎస్ మూవీస్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ఈ పాన్ ఇండియా బయోపిక్ ని నిర్మించారు.
Tags:    

Similar News