‘స్పైడర్’ పాటల్లోనూ రాజీ లేదసలు

Update: 2017-06-29 10:30 GMT
తన సినిమాల విషయంలో ఒక పట్టాన సంతృప్తి చెందడని మురుగదాస్ కు పేరుంది. సినిమాలోని ప్రతి చిన్న అంశం కూడా ప్రత్యేకంగా ఉండాలని అతడు పట్టుబడతాడని అంటారు. ఏ విషయంలోనూ అసలు రాజీ అన్న మాటకే మురుగదాస్ తావివ్వడని చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే విడుదల కావాల్సిన ‘స్పైడర్’ దసరాకు వాయిదా పడటానికి మురుగదాస్ రాజీ పడని మనస్తత్వమే కారణమని ఆ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. సినిమా ఆలస్యమైనా.. అభిమానులు చాలా కాలం పాటు ఎదురు చూడాల్సి వచ్చినా.. దాని వల్ల నష్టమేమీ లేదని.. ఆ నిరీక్షణకు.. ఆలస్యానికి తగిన ఫలితమే దక్కుతుందని ‘స్పైడర్’ చిత్ర వర్గాలు ధీమాగా చెబుతున్నాయి.

ఈ సినిమాలో చాలా సన్నివేశాల విషయంలో రీషూట్లు జరిగాయని.. క్లైమాక్స్ అయితే మళ్లీ మళ్లీ తీశారని.. మార్పులు చేర్పులు జరిగాయని చెప్పుకున్నారు. ఇప్పుడు పాటల విషయంలోనూ మురుగదాస్ రాజీ పడని శైలి చూపిస్తున్నాడట. మామూలుగా ఇలా సుదీర్ఘ కాలం షూటింగ్ జరిగాక.. మిగిలిన పాటల్ని ఏదో ఒక సెట్టింగ్ వేసి మొక్కుబడిగా కానిచ్చేస్తారు.  చకచకా అవగొట్టేస్తారు. కానీ మురుగదాస్ అలా చేయట్లేదట. ఒక్కో పాటకు వారం పది రోజుల షెడ్యూల్ వేశాడట. రెండు పాటలకూ వేర్వేరుగా కాన్సెప్ట్ అనుకుని.. లెంగ్తీగా షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం.

రెండు పాటల కోసం జులై నెలలో దాదాపు మూడు వారాలు కేటాయిస్తున్నట్ల తెలిసింది. ‘స్పైడర్’ టాకీ పూర్తవగానే కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ షూట్ లోకి వెళ్లిపోయిన మహేష్.. మళ్లీ ‘స్పైడర్’ కోసం వెనక్కి రానున్నట్లు సమాచారం. ఈ రెండు పాటల చిత్రీకరణతో ‘స్పైడర్’ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొన్ని నెలల ముందు నుంచే సమాంతరంగా జరుగుతున్నాయి. ఆ పని త్వరలోనే పూర్తవుతుందట. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి దసరా కానుకగా ఎట్టి పరిస్థితుల్లోనూ ‘స్పైడర్’ను విడుదల చేయాలని చిత్ర బృందం పట్టుదలతో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News