ఈ సినిమాకొక్కటే రేటింగ్స్ ఇవ్వకండి

Update: 2018-04-23 08:20 GMT
ఇది హీరో నాగ శౌర్య అభ్యర్ధన. రాబోయే అమ్మమ్మగారిల్లు సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా ఈ కామెంట్ చేసాడు. ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా రావని బామ్మలను అమ్మమ్మలను గుర్తు చేసే ఇలాంటి సినిమాలకు రివ్యూయర్లు రేటింగ్స్ ఇవ్వకూడదు అని అభిప్రాయపడ్డాడు. ఇది ఎవరికైనా వాళ్ళ బాల్యంలో అమ్మమ్మలతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందని అంతే కాకుండా వాళ్ళను కలుసుకునేలా ప్రేరేపిస్తుందని కూడా చెప్పాడు. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే ఉద్దేశంతో తామీ సినిమా తీయలేదని చూసి బయటికి వచ్చాక ఒక్కరికైనా వెంటనే అమ్మమ్మ ఊరికి వెళ్ళాలి అనిపిస్తే అదే తమ విజయమని చెప్పాడు. సో రివ్యూ రాసే వాళ్ళు రేటింగ్ ఇవ్వకూడదని చెప్పిన నాగ శౌర్య అది సలహాగానే చెప్పాడు కాని ఇక్కడో పాయింట్ మిస్ అయ్యాడు.

సినిమా అనేది కమర్షియల్ ప్రాపర్టీ. ఫ్రీగా ఎవరికి చూపించడం లేదు. టికెట్ కొని థియేటర్లోకి అడుగు పెట్టాక దాని గురించి కామెంట్ చేసే అధికారం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాకపోతే రివ్యూయర్లు దాన్ని వృత్తి పరంగా చేస్తారు మిగిలినవాళ్ళు నోటి మాటగా మైకు ముందు చెబుతారు. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఈ రివ్యూ సంస్క్రతి ఉంది కనక రేటింగ్ ఇచ్చినంత మాత్రాన ఏ సినిమా విలువ పెరగడం కాని తరగడం కాని జరగదు. ఇలాంటి నేపధ్యం ఉన్న సినిమాలు సీతారామయ్య గారి మనవరాలు టైం నుంచి చూస్తూనే ఉన్నాం. విషయం ఉన్నప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రేక్షకులు అలాంటి వాటికి బ్రహ్మరధం పట్టారు. గత ఏడాది వచ్చిన శతమానం భవతి ఏకంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. సో ప్రత్యేకంగా రేటింగ్స్ వద్దు అని చెప్పడం సినిమా కోసమే అయినప్పటికీ అది విని ఆచరించే వారి సంఖ్య ఎంత ఉంటుంది అంటే అనుమానమే.
Tags:    

Similar News