హాట్ టాపిక్: జనసేనకు ‘మెగా’ విరాళం

Update: 2018-12-24 13:45 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీకి ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం పెద్ద ఎత్తున విరాళం అందజేసి ఆశ్చర్యపరిచింది. నాగబాబు రూ.25 లక్షలు విరాళం ప్రకటించగా, వరుణ్ తేజ్ దానికి నాలుగు రెట్లు.. అంటే కోటి రూపాయలు పార్టీకి అందజేశాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ తెలిపాడు. ‘‘జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చిన వరుణ్‌ తేజ్‌ కు.. రూ.25 లక్షలు అందించిన నాగబాబుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇది పార్టీకి సర్‌ప్రైజ్ క్రిస్మస్‌‌ బహుమతి. మీరిద్దరూ విరాళాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. నేను తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని నేరుగా కలిసి కృతజ్ఞతలు చెబుతాను’’ అని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

నాలుగేళ్ల కిందట జనసేన పార్టీ పెట్టినపుడు నాగబాబు తమ్ముడి పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడాడు. అప్పటికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండటంతో మెగా అభిమానులందరూ ఆ పార్టీకే మద్దతుగా నిలవాలని.. అన్నయ్యతోనే ఉండాలని పిలుపు ఇచ్చాడు. కానీ కాల క్రమంలో చిరంజీవి రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకున్నారు. మరోవైపు పవన్ క్రియాశీల రాజకీయాల్లో బిజీ అయ్యాడు. జనసేన పార్టీ ఊపందుకుంది. దీంతో నాగబాబు స్వరం మారింది. ఈ మధ్య జనసేనకు.. తమ్ముడికి మద్దతుగా మాట్లాడుతున్నాడు. పవన్ పిలిస్తే పార్టీ కోసం పని చేస్తానని కూడా నాగబాబు అన్నాడు. ఇటీవలే బాలయ్య ఎవరో తెలియదంటూ నాగబాబు చేసిన కామెంట్ కూడా ఆయన ఉద్దేశాల్ని చాటిచెప్పింది. ఇంతలోనే పవన్ పార్టీకి భారీ విరాళమిచ్చి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు నాగబాబు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
Tags:    

Similar News