నాగ్ ఒకవైపే ఆలోచిస్తున్నాడా?

Update: 2018-09-30 03:30 GMT
ఒక సినిమా పరాజయం పాలైనప్పుడు లేదా యావరేజ్ గా టాక్ వచ్చినప్పుడు దానికి పూర్తి బాధ్యత దర్శకుడిదే అయినప్పటికీ ఆ కథను ఓకే చేసిన హీరో కూడా అందులో భాగం తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా నెగటివ్ రిజల్ట్ వచ్చిన సినిమాల టాక్ చూస్తే ఈ దర్శకుడేంటి ఇలా తీసాడు అనే కామెంట్స్ తో పాటు మా హీరో ఏంటి ఇలాంటి కథను ఎంచుకున్నాడు అని అభిమానులు వాపోవడం కూడా కనిపిస్తుంది. అంటే ఇద్దరికీ అందులో ప్రమేయం ఉందనే ప్రేక్షకులు భావిస్తుంటారు. కానీ నాగార్జున తీరుని కాస్త గమనిస్తే దర్శకుల వైపే తప్పుని చూపెట్టడం ఈ మధ్య బాగా హై లైట్ అవుతోంది.

దేవదాస్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను బద్ధకంగా ఉంటాడని విడుదలకు తక్కువ సమయం ఉన్నప్పుడు ఫస్ట్ కాపీ చూపాడని మీడియా ముందే కామెంట్స్ చేయటం అందరిని షాక్ కి గురి చేసింది. ఫలితం రాకుండానే ఇలా చెప్పడం శ్రీరామ్ మీద ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. అంతకుముందు భాయ్ విషయంలో వీరభద్రంని పబ్లిక్ గానే నెగటివ్ గా మాట్లాడిన నాగ్ కథ చెప్పినప్పుడే అందులో ఉన్న సవాలక్ష లోపాలను ఎందుకు గుర్తించలేకపోయాడన్న లాజిక్ ని ఎవరు అడిగే సాహసం చేయలేదు.

సరే ఇదంతా ఒకవైపు. నాగార్జున నుంచి నిరాశ పరిచే సినిమాలు ఇంతకు ముందు వచ్చాయి. ఆఫీసర్ డిజాస్టర్ గురించి తానో పాఠం నేర్చుకున్నాను అన్నాడే తప్ప వర్మను పల్లెత్తు మాట అనలేదు. ఓం నమో వెంకటేశాయ తీవ్రంగా నిరాశ పరిచినప్పుడు సైతం దర్శకేంద్రుడి గురించి మాట జారలేదు నాగ్. అంటే అనాలని కాదు కానీ యూత్ దర్శకులతో చేస్తున్నప్పుడు ఏదైనా ప్రోత్సాహకంగా మాట్లాడితే వాళ్ళ నుంచి ఇంకా బెస్ట్ రాబట్టుకోవచ్చు కానీ ఇలా నలుగురి ముందు అనేస్తే ఎలా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

సోగ్గాడే చిన్న నాయనా టైంలో కళ్యాణ్ కృష్ణతో దగ్గరుండి  రిపేర్లు చేయించినందువల్లే అది బాగా వచ్చిందన్న నాగ్ సీనియర్ల మీద పెడుతున్న నమ్మకం ఫలితాలను ఇవ్వలేకపోయినప్పుడు అదే యువ దర్శకుల మీద కూడా పెడితే ఇంకా స్వేచ్ఛగా తమ సృజనాత్మకతకు పదును పెట్టే అవకాశం ఉంటుందిగా. అయినా నాగ్ లాంటి అనుభవజ్ఞుడైన హీరోకు ఇవన్నీ తెలియవు అని కాదు కానీ చేసే చిన్న కామెంట్స్ సైతం చాలా దూరం వెళ్తున్న తరుణంలో నాగ్ అంటున్న మాటలు సదరు కుర్ర దర్శకులను ఇబ్బందిలో పెడుతున్నాయన్న మాట మాత్రం నిజం.
Tags:    

Similar News