రామ్ చరణ్ కూతురు పేరు ఇదే.. అర్థం ఏమిటంటే?

Update: 2023-06-30 17:19 GMT
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. 11 ఏళ్ళ తర్వాత వారి జీవితాలలోకి వారసురాలు రావడంతో రామ్ చరణ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి కూడా అవధులు లేవు. చాలా సంతోషంగా తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ ఇంట రామ్ చరణ్, ఉపాసన కూతురు బారసాల వేడుక గ్రాండ్ గా జరిగింది.

కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నారిని ఊయలలో వేసి బారసాల నిర్వహించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి మనవరాలిగా పేరు పెట్టారు. క్లీమ్ కారా కొనెదల అని చిన్నారికి నామకరణం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఫోటో షేర్ చేసి పంచుకున్నారు. మనవరాలిగా క్లీమ్ కారా కొనెదల అని పేరు పెట్టినట్లు తెలిపారు.

ఈ పేరుని లలిత సహస్రనామాల నుంచి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. క్లీమ్ కారా అంటే ప్రకృతి స్వరూపానికి ప్రతీక. సాక్షాత్తు మహా శక్తిని ప్రతిబింబిస్తుంది. ఆ పేరులో పవర్ ఫుల్ వైబ్రేషన్ ఉంటుంది. చిన్నారిలో ఆ లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయని కచ్చితంగా చెప్పొచ్చు అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి రామ్ చరణ్ ఉపాసన హిందూ విశ్వాసాలని ఎంత బలంగా నమ్ముతారో ఈ పేరుతోనే స్పష్టం అయిపోతుంది.

కాస్తా ఇంగ్లీష్ సౌండ్ వినిపిస్తోన్న అచ్చమైన సంస్కృతి భాష నుంచి పేరుని తీసుకొని కుమార్తెకి పెట్టడం నిజంగా గొప్ప విషయం. మరి ఈ పేరుకి తగ్గట్లుగానే ప్రకృతి శక్తిని తనలో ఇముడ్చుకొని గొప్పగా ఎదగాలని సినీ ప్రముఖులు అందరూ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి విషెస్ చెప్పడంతో పాటు బేబీకి పేరుని కూడా ట్రెండ్ చేస్తున్నారు.

జ్యోతీష్యం ప్రకారం ఆ చిన్నారి పుట్టిన ఘడియలు అద్భుతంగా ఉన్నాయని కచ్చితంగా రామ్ చరణ్ కి కుమార్తె  కారణంగా రాజభోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

Similar News