ఈ సినిమాలో నరేశ్ ను చూస్తే మా నాన్న గుర్తొచ్చాడు: నాని

Update: 2022-06-08 09:30 GMT
వివేక్ ఆత్రేయ మొదటి నుంచి చివరి వరకూ పూర్తి వినోదభరితమైన కథలనే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. అలాగే ఆయన 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా నానీ ... నజ్రియా .. వివేక్ ఆత్రేయలను బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. అసలే తెలుగు రాని నజ్రియా బిత్తిరి సత్తి మాటలకు అప్పుడప్పుడు అయోమయంగా ఎక్స్ ప్రెషన్ ఇస్తూనే .. అర్థమైనప్పుడు మాత్రం ఎంజాయ్ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం నేను కూడా వివేక్ ఆత్రేయతో పాటు నజ్రియాను ఒప్పించవలసి వచ్చింది. ఈ సినిమాలో ఆమె లీలా థామస్ పాత్రను పోషించింది. ఈ పాత్రలో ఆమె చాలా అద్భుతంగా చేసింది. ఒకవేళ ఈ  సినిమా చేయడానికి ఆమె నో అని చెబితే ఎవరిని తీసుకునే అవకాశం ఉందనే ప్రశ్నకు మా దగ్గర సమాధానమే లేదు.

ఎందుకంటే ఆ పాత్రను ఆమె చేసిన తరువాత వేరొకరిని ఊహించుకోలేం .. అంతగా ఆమె చేసింది. ఇక అందరూ ఈ సినిమా కోసమే నేను ఇలా హెయిర్ పెంచానని అనుకుంటున్నారు. కానీ ఇది 'దసరా' సినిమాకి సంబంధించిన లుక్.

'అంటే .. సుందరానికీ' అనే టైటిల్ వినగానే .. 'ఏమైంది?' అని అడుగుతున్నారు. ఏమైందనే విషయం తెలియాలంటే సినిమా చూడవలసిందే. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ సినిమాలో మా ఫాదర్ వేషం వేసిన నరేశ్ ను చూస్తే నిజంగానే మా నాన్న గుర్తొచ్చాడు.

గండాలను గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకోడుగానీ, మిగతా విషయాల్లో ఆయన చాలా స్ట్రిక్ట్. నేను మాత్రం సుందర్ ప్రసాద్ లా కాదు. వివేక్ ఆత్రేయకి కొంచెం కోపం ఎక్కువే గానీ .. పైకి కనిపించడు.  ఆయన ఫేవరెట్ పదం ఏదైనా ఉందంటే అది 'వన్ మోర్' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ .. నాని గారితో సినిమా చేయడానికి టెన్షన్ పడలేదు. నేను ఎంత సరదాగా ఆయనకి కథను వినిపించానో .. అంతకంటే ఎక్కువ సరదాగా ఆయనతో ఈ సినిమాను పూర్తి చేశాను. ఏ పాత్రకి ఎవరినైతే అనుకుని కథను రాసుకున్నానో వాళ్లనే తీసుకున్నాను ఎక్కడా రాజీపడలేదు" అని చెప్పుకొచ్చాడు. నజ్రియా మాట్లాడుతూ  " ఈ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గతంలో మా వారితో కలిసి మలయాళంలో నటించాను. తెలుగులో కూడా అలాంటి అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగానే ఉన్నాము" అని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News