బాబు గోగినేని.. ఈ మాట‌లు మ‌న‌కు అవ‌స‌ర‌మా?

Update: 2018-07-29 03:36 GMT
స‌మాజంలో కొన్ని ప్రొఫెష‌న్స్ ఉంటాయి. వాటికి ఉండే మ‌ర్యాద‌.. గౌర‌వం అంతా ఇంతా కాదు.  ఇలాంటి రంగాల్లో ఉన్న వారు త‌మ‌కు తాముగా కొన్ని నియ‌మాలు.. నిబంధ‌న‌లు పెట్టుకుంటారు. ప‌రిమితుల చ‌ట్రంలో ఉండిపోతారు. ఇందుకోసం త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల్ని ప‌ణంగా పెట్టే ధోర‌ణి క‌నిపిస్తూ ఉంటుంది.

న్యాయ‌మూర్తుల్నే చూస్తే.. వారికి కోడ్ ఆఫ్ కాండాక్ట్ తో పాటు.. జ‌డ్జిలు చాలా మంది త‌మ‌దైన జోన్ లో ఉండిపోతారు. బ‌య‌టకు ఎక్కువ‌గా రారు. అలా అని.. బ‌య‌ట‌కు వ‌స్తే ఏదో జ‌రిగిపోతుంద‌ని కాదు. ఒక ఉన్న‌తమైన స్థానంలో ఉన్న తాము.. త‌మంత‌ట తామే కొన్ని ప‌రిమితులు విధించుకొని.. తాము సాగుతున్న రంగం గౌర‌వాన్ని.. మ‌ర్యాద‌ను కాపాడుతూ ఉంటారు.

ఇప్పుడంటే జ‌ర్న‌లిస్టులు అన్న మాట విన్నంత‌నే.. ఒక‌లాంటి న‌వ్వు.. చూపు క‌నిపించే ప‌రిస్థితి. జ‌ర్న‌లిస్టు అంటేనే.. అదేదో ప‌వ‌ర్ ఫుల్ రంగంలో ఉన్న‌ట్లుగా చాలామంది భావిస్తారు. కొద్ది మంది జ‌ర్న‌లిస్టులు చేసే త‌ప్పుల‌కు  పాత్రికేయం మీద ఈ రోజు ఉన్న చుల‌క‌నా భావం అంతా ఇంతా కాదు.

నిజానికి.. పాత్రికేయుల్లో చాలామంది స‌మాజం ప‌ట్ల అభిమానం.. ఆరాధ‌న‌తో పాటు.. మార్పు కోసం.. త‌న చుట్టూ ఉండే ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న త‌హ‌త‌హ క‌నిపిస్తుంది. కానీ.. కొంద‌రు పుణ్య‌మా అని అదంతా గంగ‌లో క‌లిసిపోయిన దుస్థితి. ఎప్పుడైతే మీడియా యాజ‌మాన్యాలు.. నేరుగా తెర మీద‌కు వ‌చ్చి త‌మ‌కున్న అవకాశాల్ని వాడుకోవ‌టం మొద‌లు ప‌ట్ట‌ట‌మే కాదు.. వాటితో వ్యాపారాలు చేయ‌టం మొద‌లు పెట్టాయో.. పాత్రికేయం ఔచిత్యం అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న ప‌రిస్థితి.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లోనూ చాలామంది జ‌ర్న‌లిస్టులు నీతిగా..నిజాయితీగా ప‌ని చేయ‌టం క‌నిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే.. స‌మాజంలో గౌర‌వ‌నీయమైన స్థానాల్లో ఉన్న వారు.. కొన్ని అంశాల‌కు దూరంగా ఉండ‌టం చాలా అవ‌స‌రం. బిగ్ బాస్ హౌస్ లో బాబు గోగినేనిని చూస్తే.. ఈ విష‌యం మ‌రింత స్ప‌ష్ట‌మ‌వుతుంది.

త‌న వాద‌న‌ల‌తో కోట్లాది మందిని అభిమానులుగా చేసుకున్న ఆయ‌న‌.. బిగ్ బాస్ షోను ఒప్పుకోవ‌టం ద్వారా భారీ త‌ప్పు చేశార‌న్న మాట వినిపిస్తోంది. మొద‌ట్లో సెటిల్డ్ గా ఉన్న ఆయ‌న‌.. కొద్ది రోజులుగా ఆయ‌న తీరుపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో పెద్ద మ‌నిషిగా చ‌లామ‌ణీ అయ్యే ఆయ‌న‌.. కొంద‌రి హౌస్ మేట్స్ ప్ర‌భావానికి లోను కావ‌టం ఆయ‌న్ను డ్యామేజ్ చేస్తే.. ఇటీవ‌ల చేసుకున్న కొన్ని అంశాల‌పై ఆయ‌న ఆవేశ‌కావేశాల‌కు గురి కావ‌టం విస్మ‌యానికి గురి చేస్తుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వారాంతంలో వ‌చ్చే నాని పీకే క్లాసుల్లో కొన్ని హేతుబ‌ద్ధ‌త లేకున్నా.. వాటికి ఎదురు చెప్ప‌లేక‌.. టీచ‌రు ముందు స్కూల్ పిల్లాడి మాదిరి బాబు గోగినేని తీరు మారింది.  గ‌తంలోనూ రెండుసార్లు క్లాస్ పీకించుకున్న బాబు గోగినేని.. శ‌నివారం జ‌రిగిన షోలో నాని చేతిలో భారీ క్లాస్ పీకించుకున్నారు. ఇదంతా చూసిన‌ప్పుడు బాబు గోగినేనికి ఇది అవ‌స‌ర‌మా? అన్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. త‌న‌కున్న ఇమేజ్ బిగ్ బాస్ షోతో పెర‌గ‌టం త‌ర్వాత త‌గ్గిపోయే ప‌రిస్థితి ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.  బిగ్ బాస్ షోలో అస్స‌లు త‌ప్పులే లేవా? అంటే స‌వాల‌చ్చ చూపించొచ్చు. మ‌రి.. త‌న త‌ప్పుల్ని గుర్తించ‌ని బిగ్ బాస్‌.. హౌస్ మేట్స్ చేసే త‌ప్పులపై భారీ క్లాసులు పీక‌టం.. వారి వ్య‌క్తిగ‌త ఇమేజ్ కు దెబ్బ ప‌డేలా చేయ‌టంలో అర్థం ఏమైనా ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇమేజ్ పెంచుకోవాల‌న్న క‌క్కుర్తికి ఈ మాత్రం మూల్యం చెల్లించాల్సిందే మ‌రి!
Tags:    

Similar News