నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. జెంటిల్మన్ సక్సెస్ నానికి మంచి ఉత్సాహాన్నే ఇచ్చింది. కొత్త ప్రయోగాలు చేసేందుకు ధైర్యం కూడా అందించింది. చాలా ఏరియాల్లో నాని మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కి కూడా వచ్చేయడం విశేషం. అలాగే ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికి జెంటిల్మన్ కు ఓవర్సీస్ లో 800k కలెక్షన్స్ వచ్చాయి.
జెంటిల్మన్ ను మిలియన్ డాలర్ మూవీగా మార్చాలంటే మరో 200k అవసరం. అయితే.. రెండు వీకెండ్స్ గడిచిపోయాక ఇంత మొత్తాన్ని రాబట్టడం అంటే కొంత కష్టమే. అందుకే తన సినిమాకి మరింత ఊపు తెచ్చి.. మిలియన్ డాలర్ మూవీగా మార్చేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ప్లాన్ చేసిన నాని.. యూఎస్ లో ప్రచారం చేయబోతున్నాడు. జూలై 1న వర్జీనియాలో జెంటిల్మన్ సక్సెస్ మీట్ కు హాజరు కావడం వెనక ఆలోచన ఇదే అని తెలుస్తోంది. దీనితోపాటు ఓవర్సీస్ పబ్లిసిటీ విషయంలో నిర్మాతల దగ్గర మరిన్ని ఆలోచనలు కూడా ఉన్నాయంటున్నారు.
చాలా మంది స్టార్స్ కు కూడా కష్టంగా ఉన్న మిలియన్ డాలర్ మార్క్ ను.. నాని ఇప్పటికి రెండు సార్లు అందుకున్నాడు. మొదట ఈగ చిత్రం ఈ మిలియన్ డాలర్లను క్రాస్ చేయగా.. గతేడాది భలేభలే మగాడివోయ్ కూడా క్రాస్ చేసింది. నాని గత చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాధ.. దాదాపు ఈ మార్క్ వరకూ వచ్చినా అందుకోలేకపోయింది. ఇప్పుడు జెంటిల్మన్ విషయంలో మాత్రం మిలియన్ డాలర్లు అందుకునేందుకు స్పెషల్ ప్రమోషన్స్ చేయనుండడం విశేషం. మూడో మూవీని కూడా మిలియన్ డాలర్లు దాటిస్తే.. ఓవర్సీస్ లో నాని రేంజ్ మరింతగా పెరగడం ఖాయం.