‘అర్జున్ రెడ్డి’ని ఎత్తేశాడుగా..

Update: 2017-08-06 06:44 GMT
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఆకాశానికెత్తేశాడు నాని. ఈ సినిమా తెలుగు సినిమా గమనాన్నే మార్చేస్తుందని నమ్ముతున్నట్లు నాని చెప్పాడు. ఇలాంటి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మేకర్స్ కు నాని థ్యాంక్స్ చెప్పాడు. తన మిత్రుడు విజయ్ దేవరకొండ మీద కూడా నాని ప్రశంసల జల్లు కురిపించాడు. ‘అర్జున్ రెడ్డి’ థియేట్రికల్ ట్రైలర్ చూడగానే సినిమా మూడ్లోకి వెళ్లిపోయేలా ఉందని.. ఇలా జరగడం అరుదైన విషయమని నాని అన్నాడు.

‘‘ఈ మధ్య ఎలా అయిపోయిందంటే.. ఒక ట్రైలర్ చూసి సినిమా చూడాలా వద్దా అని డిసైడవుతున్నాం. ఐతే సినిమాకు వెళ్లాక మన ఫోన్లు.. ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి సినిమాలో లీనం కావడానికి ఇంటర్వెల్ వరకు సమయం పడుతుంది. కొన్ని సినిమాలకు క్లైమాక్స్ దగ్గర లీనమవుతాం. ఇంకొన్ని సినిమాలకు ఏ దశలోనూ అలా లీనం కాము. కానీ ‘అర్జున్ రెడ్డి’ విషయంలో మాత్రం ట్రైలర్ చూడగానే సినిమా మూడ్ లోకి వెళ్లిపోతున్నాం. ఇలా జరగడం చాలా కాలం తర్వాత చూస్తున్నా.

‘అర్జున్ రెడ్డి’ థియేట్రికల్ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది. చాలా షాకింగ్ గానూ ఉంది. మనం మన తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పు ఇప్పుటికే చూస్తున్నాం. ఈ సినిమా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందనుకుంటున్నా. విజయ్ దేవరకొండ గురించి ఎవరు మాట్లాడినా.. బాగా చేస్తున్నాడని అన్నా నాకు ఒకరకమైన గర్వంగా ఉంటుంది. అతణ్ని ఓ బ్రదర్ లాగాభావిస్తాను. అతను ఇలాంటి సినిమా చేయడం ఇంకా సంతోషంగా ఉంది.

విజయ్ నా సినిమా ‘ఎవడో సుబ్రమణ్యం’తో లాంచ్ అయ్యాడు. తర్వాత అతడి ‘పెళ్లిచూపులు’ సినిమా టీజర్ ను నేనే లాంచ్ చేశా. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ ఆవిష్కరించాను. ఇలా తన సక్సెస్ కు సంబంధించిన ప్రతి మెట్టులో నేనూ ఉంటున్నా. ‘అర్జున్ రెడ్డి’ లాంటి కొత్త తరహా సినిమాలకు మంచి సపోర్ట్ అవసరం. ఏషియన్ ఫిలిమ్స్ లాంటి పెద్ద సంస్థ ఆ సపోర్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కొత్త ప్రయత్నాల్ని అలాంటి పెద్ద సంస్థలు నమ్మడం మొదలుపెడితే చాలా మంచి జరుగుతుంది. ఇప్పటిదాకా మనం ఫాలో అవుతున్న ఫార్ములాలు.. ఫార్మాట్లు అన్నింటినీ ‘అర్జున్ రెడ్డి’ తీసి పక్కన పడేసి బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తున్నా’’ అని నాని అన్నాడు.
Tags:    

Similar News