#నంది గొడవ: పాతిపెట్టేశాక బయటికి తీశారే..

Update: 2017-11-22 09:11 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించాక నాలుగైదు రోజుల పాటు దీని మీద తీవ్ర స్థాయిలోనే చర్చలు జరిగాయి. ఈ అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ ఎంతో కొంత అసంతృప్తి వ్యక్తం కావడం మామూలే. కానీ నిరసన గళాలు మరీ ఎక్కువగా ఏమీ ఉండవు. గతంలో ప్రముఖులెవ్వరూ ఇంతగా స్పందించింది లేదు. కానీ ఈసారి అవార్డుల్లో కొన్ని మరీ ఏకపక్షంగా ఉండటంతో వివాదం చెలరేగింది. చాలామంది ప్రముఖులు వ్యతిరేక గళం వినిపించారు. మీడియా ముందుకొచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టారు. టీవీ చర్చల్లో పాల్గొన్నారు. తమ నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ వివాదం చాలా పెద్ద స్థాయికి వెళ్లింది.

ఐతే ఎంత పెద్ద వివాదం అయినా సరే.. ఓ నాలుగైదు రోజులు వార్తల్లో ఉండటం.. ఆ తర్వాత మీడియాతో పాటు జనాలు కూడా దాన్ని వదిలేయడం.. ఇంకో అంశం మీదికి వెళ్లిపోవడం అన్నది మామూలే. నంది అవార్డుల వివాదం కూడా అలాగే జరిగింది. ఐదారు రోజుల తర్వాత అందరూ దీన్ని మరిచిపోయారు. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి.. చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఈ వివాదాన్ని మళ్లీ బయటికి తీశారు. ఏపీలో ఆధార్ లేని వాళ్లు విమర్శలు చేస్తున్నారంటూ నోరు జారి బుక్కయిపోయారు. దీంతో విమర్శకులకు మళ్లీ ఆయుధం దొరికింది. పోసాని మీడియా ముందుకొచ్చాడు. దీనిపై ఒక్కొక్కరుగా అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. మళ్లీ టీవీల్లో చర్చలు మొదలైపోయాయి.

ముగిసిందనుకున్న వివాదం మళ్లీ తెరమీదికి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి.. ప్రభుత్వానికి మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి. చంద్రబాబు లాగా ఈ వివాదంపై లౌక్యంగా సమాధానం చెబితేనో.. బాలయ్య లాగా నవ్వేసి ఊరుకుంటేనో సరిపోయేదానికి లోకేష్.. అనవసరంగా కామెంట్ చేసి దొరికిపోయాడు. ఇప్పటికే వచ్చిన విమర్శలు.. అప్రతిష్ట చాలదని.. ఇప్పుడు కొత్తగా ఇంకో వివాదం తెరమీదికి వచ్చింది. లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చిపెట్టాయి. చాలా పెద్ద ఇష్యూ అయ్యేలా ఉన్నాయి ఇప్పుడు. మొత్తానికి దానంతటదే మరుగున పడ్డా వివాదాన్ని కెలిగి.. చాలా ఇబ్బందికర పరిస్థితి తెచ్చుకున్నాడు లోకేష్.
Tags:    

Similar News