ముహూర్తం ఖాయం చేసిన నారా రోహిత్

Update: 2015-10-14 09:36 GMT
వేగంగా సినిమాలు పూర్తి చేసే డైరెక్టర్లు, హీరోల్ని చాలా తక్కువగా చూసేవాళ్లు ఒకప్పుడు. రెండు మూడు నెలల్లో సినిమాలు తీస్తే ఏం క్వాలిటీ ఉంటుంది అని ఎద్దేవా చేసేవాళ్లు. ఐతే ఇప్పుడు స్టార్ హీరోలు సైతం ఐదారు నెలల్లో సినిమాలు పూర్తి చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎన్ని ఎక్కువ రోజులు సినిమా తీస్తే అంత క్వాలిటీ ఉంటుందన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. మంచి కథ ఎంచుకుని పక్కా ప్లానింగ్ తో సినిమా చేస్తే మూణ్నెల్లలో పూర్తి చేసిన సినిమాలోనూ సూపర్ క్వాలిటీ ఉంటుందని రుజువు చేసిన కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు.

గత ఏడాదిన్నరలో రోహిత్ ప్రతినిధి - రౌడీఫెలో - అసుర లాంటి సినిమాలు వచ్చాయి రోహిత్ నుంచి. అవన్నీ మూణ్నాలుగు నెలల్లో పూర్తయినవే. కానీ కంటెంట్ - క్వాలిటీ పరంగా అందులో ఏదీ తక్కువ కాదు. ఈ సినిమాలకు వచ్చిన స్పందన చూశాక రోహిత్ స్పీడు మరింత పెరిగింది. ఈ మధ్యే కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ‘మాన్ కరాటె’ రీమేక్ మూవీని మొదలుపెట్టిన మూణ్నెల్లకే పూర్తి చేశాడతను. ఇప్పుడు ఇంకో సినిమాకు ముహూర్తం సిద్ధం చేశాడు.

‘ప్రేమ ఇష్క్ కాదల్’ లాంటి అభిరుచి ఉన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ సాధినేని దర్శకత్వంలో రోహిత్ చేయబోయే ‘సావిత్రి’ ఈ నెల 23న రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. ఈ  మూవీని కూడా తనదైన స్టయిల్లో మూడు నెలల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు రోహిత్. ఇందులో రోహిత్ సరసన నందిత హీరోయిన్ గా నటించనుంది. రాజేంద్ర ప్రసాద్ అనే కొత్త నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కృష్ణచైతన్య మాటలు, శ్రవణ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Tags:    

Similar News