వెనక్కి తగ్గిన వెంకీ.. 'నారప్ప' విడుదల వాయిదా..!

Update: 2021-04-29 06:03 GMT
విక్టరీ వెంకటేష్ - దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''నారప్ప''. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై క‌లైపులి ఎస్.థాను - సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ హీరో ధనుష్‌ కు రెండోసారి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన 'అసురన్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. కథలో పెద్దగా మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా మే 14న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసినా, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా వెనక్కి తగ్గారు మేకర్స్. 'నారప్ప' చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కోవిడ్ నేపథ్యంలో ప్రజారోగ్యం రక్షణ దృష్టిలో పెట్టుకొని 'నారప్ప' సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ''నారప్ప చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు.. అందరికీ మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో ఉంచుకుని చిత్రం విడుదలని వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మహమ్మారి వీలైనంత తొందరగా దూరం కావాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈ చిత్రానికి ఇష్టంతోనూ, అంకితభావంతోనూ పనిచేసిన ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అందరం ఇళ్లల్లోనే ఉండి మన పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగానే ఎదుర్కొందాం. అందరం మాస్కులు ధరించి, దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ సమాజానికి చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నందరినీ అలరించాలని కోరుకుంటున్నాం'' అని 'నారప్ప' టీమ్ పేర్కొంది.

'నారప్ప' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ ప్రకటన వెలువరించింది. కాగా, ఈ సినిమాలో వెంకటేష్ భార్య సుందరమ్మ పాత్రలో హీరోయిన్ ప్రియమణి నటించింది. కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్‌ ఎడిటర్ గా.. గాంధీ నడికుడికర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Tags:    

Similar News