కథానాయిక వెనుక దాగిన కాదంబరి ఎవరు? .. ఆసక్తిని రేపుతున్న నాట్యం' ట్రైలర్!

Update: 2021-10-17 06:03 GMT
తెలుగులో నాట్య ప్రధానమైన కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో మాత్రం అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. శాస్త్రీయ నాట్యం తెలుగు తెరను స్పర్శించి చాలాకాలమే అయింది. నృత్య ప్రధానమైన కథా చిత్రాలు చేయాలంటే, కథానాయికలకు నాట్యంలో ప్రవేశం ఉండాలి. లేదంటే అలాంటి కథలను టచ్ చేయడమనేది సాహసమే అవుతుంది. మాళవిక సర్కార్ మంచి డాన్సర్ కనుక 'ఆనందభైరవి' ప్రేక్షకులను పలకరించింది. భానుప్రియ గొప్ప డాన్సర్ కనుక 'స్వర్ణకమలం' కళాఖండమై నీరాజనాలు అందుకుంది.

ఇక ఈ తరహా సినిమాలు కళాభిరుచి ఉన్నవారే తెరకెక్కిస్తుంటారు .. కళాభిరుచి ఉన్నవారే చూస్తుంటారు. అందువల్లనే కమర్షియల్ సినిమాల దృష్టితో వీటిని చూడలేం. ఈ తరహా సినిమాలతో లాభాలు కూడా తెచ్చిపెట్టగలిగిన దర్శకుడిగా ఒక్క విశ్వనాథ్ గారే కనిపిస్తారు. అయితే అలాంటి సినిమాలు చేయడానికి కళాభిరుచి ఉన్న నిర్మాతలు ఇప్పుడు దొరకడం కష్టమే. అందువల్లనే ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్య రాజు 'నాట్యం' అనే తన సినిమాకి తనే నిర్మాతగా మారారు. 'నాట్యం' ద్వారా తెలుగు తెరకి నీరాజనం పట్టడానికి సిద్ధమయ్యారు.

సంధ్య రాజు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి రేవంత్ కోరుకొండ దర్శకుడిగా వ్యవహరించాడు. భానుప్రియ.. శుభలేఖ సుధాకర్ .. ఆదిత్య మీనన్ .. కమల్ కామరాజు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేదికపై ఆయన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాతదారులను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది .. ఆకట్టుకుంటోంది. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అనే విషయం తెలుస్తోంది.

నాట్యం అంటే కథానాయికకు ప్రాణం. కాదంబరి కథను నాట్యంగా ప్రదర్శించడం ఆమెకి ఇష్టం. కానీ ఆమెకు కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఎదురవుతుంది. ఇంటి గౌరవం .. ఊరు కట్టుబాట్లు ఆమె ఆనందానికి .. ఆశయానికి .. ప్రేమకి అడ్డుగోడగా మారతాయి. అప్పుడు ఆమె ఏం చేస్తుందనేదే కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. "కాదంబరి కథను నేను ఎంచుకోలేదు .. ఆ కథనే నన్ను ఎంచుకుంది. ఆ కాదంబరియే మన ద్వారా తన కథను బయటికి తీసుకురావాలని అనుకుంటోంది" అనే నాయిక డైలాగ్, ఈ సినిమాలో లోతైన మరో కోణం ఉందనే విషయాన్ని విప్పుతోంది. సంధ్య రాజు ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ .. సంగీతం .. డాన్స్ .. బలమైన కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయనిపిస్తోంది.     


Full View
Tags:    

Similar News