విచార‌ణ‌లో న‌వ‌దీప్ ఏం చెప్పారు?

Update: 2017-07-25 04:28 GMT
సంచ‌ల‌నం సృష్టిస్తున్న డ్ర‌గ్స్ విచార‌ణ‌లో ప్ర‌ముఖ సినీ న‌టుడు న‌వ‌దీప్‌ ను సిట్ అధికారులు విచారించిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 12 మంది సినీ ప్ర‌ముఖుల‌కు అధికారులు నోటీసులు అందించగా.. సోమ‌వారం న‌వ‌దీప్ అధికారుల ఎదుట హాజ‌ర‌య్యారు. ఉద‌యం ప‌దిన్న‌ర గంట‌ల‌కు మొద‌లైన విచార‌ణ రాత్రి తొమ్మిదిన్న‌ర గంట‌ల పాటు సాగింది.

మొత్తం ప‌ద‌కొండు గంట‌ల పాటు సాగిన విచార‌ణ‌లో ప‌లు కీల‌క అంశాల మీద ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్లుగా చెబుతున్నారు. వివిధ మీడియా రిపోర్ట్ ల ప్ర‌కారం న‌వ‌దీప్ ను సిట్ అధికారులు లోతుగా విచారించిన‌ట్లుగా తెలుస్తోంది. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో న‌వ‌దీప్‌ కు సంబంధించిన స‌మాచారం అధికారుల వ‌ద్ద భారీగానే ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌చ్చిబౌలిలోని బీపీఎం ప‌బ్ కూడా ఆయ‌న‌దేన‌ని చెబుతుంటారు. ఇదే విష‌యాన్ని విచార‌ణ సంద‌ర్భంగా అధికారులు ప్ర‌శ్నించ‌గా.. తాను భాగ‌స్వామిన‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆయ‌న‌కు చెందిన ప‌బ్ లో డ్ర‌గ్స్ వినియోగిస్తార‌ని.. మ‌త్తు డ్రింక్‌ ను స‌ర‌ఫ‌రా చేస్తార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌ల్లో జ‌రిగే ఈవెంట్ల‌ను న‌వ‌దీప్ నిర్వ‌హిస్తుంటారు. ఇదే విష‌యాన్ని త‌మ విచార‌ణ సంద‌ర్భంగా అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లుగా తెలుస్తోంది. అధికారులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు  న‌వ‌దీప్ నో చెప్పిన‌ట్లుగా స‌మాచారం.

డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు ఉందా? అన్న ప్ర‌శ్న‌కు తాను సంప్ర‌దాయ కుటుంబం నుంచి వ‌చ్చిన‌ట్లుగా న‌వ‌దీప్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా గ‌తంలో మ‌ద్యం సేవించి ప‌ట్టుబ‌డిన అంశాన్ని ప్ర‌శ్నించ‌టంతో పాటు.. కొన్ని వీడియో క్లిప్పింగులు చూపించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు న‌వ‌దీప్ స‌మాధానాలు ఇవ్వ‌కుండా మౌనంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

వాట్సాప్ గ్రూపుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని న‌వ‌దీప్‌ కు అధికారులు చూపించి.. ప్ర‌శ్న‌లు అడ‌గ్గా స‌మాధానాలు ఇవ్వ‌కుండా మౌనంగా ఉండిపోయార‌ని.. మ‌ధ్య మ‌ధ్య‌లో మాత్రం త‌న‌పై నింద‌లు మోప‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. బీపీఎం ప‌బ్ లో మ‌త్తు డ్రింక్ సర్వ్ చేస్తార‌ట క‌దా? అని ప్ర‌శ్నించ‌గా అలాంటిదేమీ లేద‌న్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. క‌స్ట‌మ‌ర్ల‌కు వాట్సాప్ మెసేజ్ లు పెడుతున్నారు క‌దా? అని ప్ర‌శ్నించ‌గా.. అలాంటిదేమీ లేద‌న్న‌ప్ప‌టికీ.. త‌మ వ‌ద్ద‌నున్న వాట్సాప్ మెసేజ్ ల‌ను చూపించ‌గా.. చివ‌ర‌గా  అంగీక‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

వాట్సాప్ మెసేజ్ లు కొన్నిసార్లు కోడ్ భాష‌లో వెళ్ల‌టం వాస్త‌వ‌మేన‌ని ఒప్పుకున్న‌ట్లుగా స‌మాచారం. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

డ్ర‌గ్స్ కేసులో నిందితుడు జీషాన్ ఆలీతో ప‌రిచ‌యం ఉంద‌ని.. కెల్విన్ మాత్రం సంబంధం లేద‌ని న‌వ‌దీప్ స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. సినీ ప్ర‌ముఖుల‌కు.. ఇత‌రుల‌కు తాను ఈవెంట్లు చేస్తాన‌ని.. ఈ సంద‌ర్భంగా ఈవెంట్ మేనేజ‌ర్ అయిన కెల్విన్ తో ప‌రిచ‌యం ఉంద‌ని.. అంత‌కు మించి మ‌రింకేమీ త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. వాట్సాప్ మెసేజ్ ల‌లో క్రాక్ అంటే ఏమిట‌ని అధికారులు ప్ర‌శ్నించ‌గా.. త‌న‌కు తెలీద‌న్న మాట‌ను న‌వ‌దీప్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News