కరణ్ జోహార్ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు ఆధారాలు లేవు: ఎఫ్‌ ఎస్‌ ఎల్‌

Update: 2020-10-26 15:37 GMT
ఇటీవల బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇంట్లో 2019లో జరిగిన పార్టీ గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. కరణ్‌ నిర్వహించిన ఈ పార్టీలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె - రణ్‌ బీర్‌ కపూర్‌ - షాహిద్‌ కపూర్‌ - విక్కీ కౌశల్‌ - మలైకా అరోరా - అర్జున్‌ కపూర్‌ - వరుణ్‌ ధావన్‌ - జోయా అక్తర్‌ - అయాన్‌ ముఖర్జీ తదితరులు కనిపించారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో భాగంగా బయటకొచ్చిన డ్రగ్స్ ఇష్యూతో నేపథ్యంలో కరణ్‌ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో హల్ చల్ చేసింది. ఈ వీడియోలో సినీ ప్రముఖుల ప్రవర్తన చూస్తుంటే డ్రగ్స్‌ తీసుకున్నట్లు అర్థమౌతోందని నెటిజన్స్ విమర్శలు చేశారు. శిరోమణి అకాలీదళ్ నాయకుడు మన్‌జిందర్‌ సింగ్‌ వంటి వారు బాలీవుడ్‌ స్టార్స్‌ డ్రగ్స్‌ సేవించారని ఆరోపిస్తూ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో మన్‌జిందర్‌ సింగ్‌ పై కేసు నమోదు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ విచారంలో కరణ్‌ జోహార్‌ ఇంట్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది.

కరణ్‌ జోహార్‌ ఇంట్లో 2019లో ఏర్పాటు చేసిన పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌) కరణ్‌ కు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులు డ్రగ్స్‌ సేవించినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని.. ఆ వీడియోలో కనిపిస్తోన్న తెల్లటి గీత ట్యూబ్‌ లైట్‌ యొక్క ప్రతిబింబమని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిర్ధారించినట్లు తెలిసింది. ఈ వీడియో వైరల్ అయినప్పుడే కరణ్‌ జోహార్ దీనిపై వివరణ ఇస్తూ.. అలాంటి తప్పు జరిగి ఉంటే ఆ వీడియో ఎందుకు పోస్ట్‌ చేస్తానని ప్రశ్నించాడు. ఈ మధ్య డ్రగ్స్ కేసులో ధర్మ ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్ క్షితిజ్ ప్రసాద్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కరణ్ ఓ లేఖ విడుదల చేశారు. తనపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నాని.. అనుభవ్ చోప్రా - క్షితిజ్ ప్రసాద్ వ్యక్తిగత జీవితాలతో నాకు, ధర్మ ప్రొడక్షన్స్‌ కు ఎలాంటి సంబంధమూ లేదని.. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. డ్రగ్ డీలర్స్ ఎవరితోనూ సంప్రదింపలు జరపలేదని కరణ్ జోహార్ పేర్కొన్నాడు.


Tags:    

Similar News