ఎంత మంచివాడవురా..డిస్కోరాజా కూడా ఇండస్ట్రీ హిట్లేనా?

Update: 2020-01-29 04:30 GMT
కొన్ని పదాలను వాటి అర్థాలను చెడగొట్టడంలో మన భారతీయులను మించిన వారు లేరు. ఉదాహరణకు సెక్యులరిజం.  ఈ పదానికి నిజమైన అర్థం ఏంటో తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా డిక్షనరీలు రాసిన మహానుభావులే దిగిరావాలి. ఇక ఇలాంటి పదాలు చాలానే ఉన్నాయి.  మన ఫిలిం ఇండస్ట్రీనే ఉదాహరణగా తీసుకుంటే 'సక్సెస్ మీట్' అనే పదాన్ని సర్వనాశనం చేశారు.  ప్రతి సినిమాకు సక్సెస్ మీట్ జరపడం అనేది ఒక చెత్త సంప్రదాయంగా మారింది.  దీంతో సోషల్ మీడియాలో సక్సెస్ మీట్ అంటే ఫెయిల్యూర్ మీట్ అనే సెటైర్లు పడుతున్నాయి.

ఇక హిట్.. సూపర్ హిట్ అనే పదాలను కూడా భ్రష్టుపట్టించారు మన మేకర్లు. తాజాగా ఈ రొంపిలోకి 'ఇండస్ట్రీ హిట్' అనే పదాన్ని కూడా లాగారు.  ఒకరు ఇండస్ట్రీ హిట్ అన్నారు.  పోటీగా మరొకరు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అన్నారు. ఈ రచ్చకు ముందు ఇండస్ట్రీ హిట్/ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అనే పదానికి అర్థం 'ఇండస్ట్రీలో గతంలో ఉన్న హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొట్టిన సినిమా'.  ఇప్పుడు కొత్త అర్థం ఏంటంటే మనకు తోచిన నంబర్లు వేసుకుని వాటిని 1 తో భాగాహారం చేసి దాన్ని నాలుగుతో గుణించి వాటికి జీఎస్టీ కలిపి..ఆ మొత్తానికి హీరోగారి పైత్యాన్ని జోడించి ఒక కొత్త సంఖ్యను పుట్టిస్తారు. ఆ నంబర్లే జెన్యూన్ నంబర్లు అంటూ గుడ్డిగా వాదిస్తారు.. జోరుగా ప్రచారం చేస్తారు.  కాలకేయుల మాదిరిగా ఉండే ఫ్యాన్స్ తమ హీరో సినిమా కలెక్షన్స్ నిజం.. పోటీలో ఉన్న హీరోవి తప్పు అంటారు.  

ఈ ఫేక్ కలెక్షన్ నంబర్లపైన సోషల్ మీడియాలో జోకులు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి.  ఒక నెటిజన్ ఎంత సింపుల్ గా తేల్చాడంటే "ఇకపై హిట్ సినిమా కోసం ఎవరూ  కష్టపడాల్సిన పనిలేదు.  **కు తోచిన సినిమా తీసి జనాలపై వదిలి హిట్ సినిమా అని ప్రచారం చేసుకోవాలి"..  ఘాటుగా ఉన్నప్పటికీ ఇదే నిజం అని చెప్పక తప్పదు.  ఇక మరో నెటిజన్ "ఎంత మంచివాడవురా.. డిస్కోరాజా కూడా ఇండస్ట్రీ హిట్లే కదా.. ఎందుకు పోస్టర్లు వెయ్యలేదు.. ఫాఫం" అని వెటకారంగా ప్రశ్నించాడు.  ఇప్పటికైనా ఈ ఫేక్ ప్రచారాలు చేసుకునే మారాజులకు ఈ నెటిజన్ల సెటైర్లు.. ట్రోలింగ్ అర్థం అవుతుందా.. లేక యూనివర్సల్ రికార్డు.. గెలాక్సీ రికార్డ్ అంటూ కొత్త పదాలు వాడి వాటిని కూడా జోక్స్ గా మారుస్తారా?


Tags:    

Similar News