#ది బిగ్ బుల్.. ఆయ‌న స్కామ్ తో పోలిస్తే ఈయ‌న స్కామ్ కూడా ఒక స్కామేనా?

Update: 2021-04-09 12:30 GMT
ఒక‌రు స్కామ్ చేశాక‌.. మ‌రొక‌రు ఆ స్కామ్ ని అనుస‌రిస్తామంటే ఎలా? ఇదిగో రిజ‌ల్ట్ ఇలానే ఉంటుంది. బిగ్ బి వార‌సుడు స్మాల్ బి అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టించిన స్కామ్ నేప‌థ్య డ్రామా `ది బిగ్ బుల్` ఓటీటీలో రిలీజైపోవ‌డం అప్పుడే రిజ‌ల్ట్ వ‌చ్చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఆయ‌న స్కామ్ తో పోలిస్తే ఈయ‌న స్కామ్ కూడా ఒక స్కామేనా? అంటూ అభిమానులే ది బిగ్ బుల్ పై పెద‌వి విరిచేస్తున్నారు. స్కామ్ 1992 చూశాక ది బిగ్ బుల్ ఆ రేంజులో సంతృప్తి ప‌రచ‌లేక‌పోయింద‌ని విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ట్విట్టర్ యూజర్లు అభిషేక్ బచ్చన్ సినిమాపై తీవ్ర‌ నిరాశను వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని గతంలో విడుదల చేసిన స్కామ్ 1992 తో పోల్చి చూస్తూ విమ‌ర్శిస్తున్నారు.

ది బిగ్ బుల్ కి కుకీ గులాటి దర్శకత్వం వహించారు. హర్షద్ మెహతా  స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా  నిజఘటనల నుండి ప్రేరణ పొంది ఈ సినిమాని రూపొందించారు. మార్కెట్ ని తరచూ దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ అని పిలుస్తారు. దానినే టైటిల్ గా నిర్ణ‌యించారు. ఈ చిత్రంలో జూనియర్ బచ్చన్ తో పాటు గోవా బ్యూటీ ఇలియానా డిక్రజ్  నటించారు. ఈ చిత్ర నిర్మాతలలో అజయ్ దేవ్ ‌గన్ కూడా ఒకరు.

బిగ్ బుల్ క‌థాంశం.. స్టాక్ బ్రోకర్ హేమంత్ షా (అభిషేక్ బచ్చన్) చుట్టూ తిరుగుతుంది. 90 ల ప్రారంభంలో దేశంలో అతిపెద్ద‌ స్కామ్ కి పాల్ప‌డిన విధానం.. ఆర్థిక మోసాలకు పర్యాయపదంగా హేమంత్ షా ఎలా వెలిగిపోయాడో ఈ చిత్రంలో చూపించారు. ఈ కథ హర్షద్ మెహతా జీవితంపై ఆధారపడి రాసుకున్న‌ది. జర్నలిస్ట్ సుచేతా దలాల్ తన పరిశోధనాత్మక రిపోర్టేజ్ ద్వారా ఈ కుంభకోణాన్ని బయటపెట్ట‌గా ఆ పాత్ర ఆస‌క్తిని క‌లిగిస్తుంది. అయితే నిజ‌జీవిత పాత్ర‌ధారుల వాస్తవిక పేర్లను ఇందులో య‌థాత‌థంగా ఉప‌యోగించ‌లేదు. కార‌ణం ఏదైనా ది బిగ్ బుల్  OTT సిరీస్ `స్కామ్ 1992` తో పోలికను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. సినిమా విడుదలైన వెంటనే అభిమానులు ట్విట్టర్ లో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. అయినా ఒకే క‌థాంశంతో సారూప్య‌త‌లు ఉన్న‌ప్పుడు చివ‌రిగా తెర‌కెక్కించే మేక‌ర్స్ చేసేది సాహ‌స‌మేనని గ‌తంలోనూ చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. అయినా అభిషేక్ బృందం ఈ ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగించి విఫ‌ల‌మైంది.
Tags:    

Similar News