పొలిటికల్ ఎంట్రీ పై నోరు విప్పిన ఎన్టీఆర్..!

Update: 2022-03-31 11:30 GMT
నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనేది చాలా మంది అభిమానులు అభిలాష. తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ వారసుడని భావించేవారు ఉన్నారు. అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తారక్ ను పదేపదే కోరుతూ వస్తున్నారు.

ఇప్పటికే అనేకసార్లు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా తారక్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. టీడీపీ కి పునర్వైభవం రావాలంటే ఎన్టీఆర్ బాధ్యత తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది.

ఇక పొలిటికల్ ఎంట్రీ పై ఎన్టీఆర్ మోనం వహిస్తూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో ఈ అంశం మీద ప్రశ్నలు ఎదురైనా.. రాజకీయాలపై మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదంటూ దాటవేస్తూ వచ్చారు. ప్రస్తుతం RRR సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తారక్.. తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్టీవ్ పాలిటిక్స్ గురించి నోరు విప్పారు.

క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను'' అని అన్నారు.

''భవిష్యత్తు ఇప్పటి నుండి పదేళ్లు లేదా ఐదేళ్ల తర్వాత.. భవిష్యత్తు అంటే మీ నెక్స్ట్ సెకన్ అని నమ్మే వ్యక్తిని నేను కాదు. ప్రస్తుతానికి నేను ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని ఉంది. ప్రస్తుతానికి ఈ క్షణానికే కట్టుబడి ఉంటాను'' అని తారక్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ మాటలను బట్టి ప్రస్తుతానికి యాక్టీవ్ పాలిటిక్స్ మీద ఆసక్తి కనబరచడం లేదని అర్థం అవుతోంది. కాకపోతే నందమూరి ఫ్యాన్స్ మరియు కొంతమంది టీడీపీ కార్యకర్తలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ ఆవిర్భవించి నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తారక్ అయితే పార్టీని పునరుద్ధరించగలరని.. అయితే ఇతర కారణాల వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా మాట్లాడలేకపోయారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

నిజానికి ఎన్టీఆర్ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నిక‌ల్లో ప్రచారం కూడా చేశారు. తనదైన ప్రసంగాలతో అదరగొట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో తారక్ పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. అయితే ఎందుకనో టీడీపీ అధిష్టానం జూనియర్ ను పార్టీ వ్యవహారాలకు దూరం పెడుతూ వచ్చింది. లోకేష్ కి కాంపిటేషన్ వస్తాడని.. నారా వారసుడికి ఇబ్బందులు తలెత్తుతాయని చంద్రబాబు - బాలయ్య కావాలనే అతన్ని పార్టీకి దూరం పెట్టారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

బాబాయ్ బాలకృష్ణ సైతం ఆ మధ్య ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ప్లస్ అవ్వచ్చు.. మైనస్ అవ్వచ్చు.. ప్లస్ అయ్యి మైనస్ అవ్వొచ్చు.. మైనస్ అయ్యి ప్లస్ అవ్వొచ్చు అంటూ భిన్నమైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అయినా సరే అభిమానులు మాత్రం తారక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని పదేపదే కోరుతున్నారు. చంద్రబాబు - లోకేష్ సభల్లో 'ఫ్యూచర్ సీఎం ఎన్టీఆర్' అంటూ నినాదాలు చేయడమే కాకుండా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాడనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News