ఇది స‌రే మ‌రి 'మా' బిల్డింగ్ మాటేంటీ?

Update: 2022-08-05 02:30 GMT
టాలీవుడ్ ప్ర‌స్తుతం విచిత్ర‌మైన ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. పెరిగిన బ‌డ్జెట్ లు, హీరోల పారితోషికాలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల అద‌న‌పు ఖ‌ర్చులు, ఓటీటీల ప్ర‌భావం, టికెట్ ల పెరుగుద‌ల వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల ఇండ‌స్ట్రీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంద‌ని టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ దీనికి స‌రైన ప‌రిష్కారాల్ని క‌నుగొనాల‌ని ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. గురువారం తో షూటింగ్ ల బంద్ నాలుగ‌వ రోజుకు చేరింది.

అన్నీ బంద్ అని చెబుతున్నా లోలోప‌ల మాత్రం కొన్ని సినిమాల షూటింగ్ లు జ‌రుగుతున్నాయంటూ ప‌లువురు నిర్మాత‌లు ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు చేస్తూనే వున్నారు. ఒక‌రిద్ద‌రు త‌మ సినిమాల షూటింగ్ ల‌ని ఏవేవే సాకుల‌తో కంటిన్యూ చేయ‌డం స‌రికాద‌ని బంద్ అంటే అంద‌రూ బంద్ పాటించాల‌ని ఇటీవ‌ల చాలా మంది నిర్మాత‌లు బాహాటంగానే కామెంట్ లు చేస్తున్నారు. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఇటీవ‌ల ఆర్టిస్ట్ ల‌, స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్ ల‌పై `మా` అసోసియేష‌న్ తో నిర్మాత‌ల మండ‌లి, ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యులు ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు.

ప‌లు కీల‌క అంశాల‌పై ఓ అవ‌గాహ‌ణ‌కు వ‌చ్చారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు కొంత మంది చాలా వ‌ర‌కు పారితోషికాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్టుగా దిల్ రాజు `మా` స‌భ్యుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మా అధ్య‌క్షుడు మంజు విష్ణు హామీ ఇచ్చార‌ట‌. అంతే కాకుండా కొత్త వాళ్ల‌ని కూడా ఎంక‌రేజ్ చేయాల‌ని, మా అసోసియేష‌న్ లో మెంబ‌ర్లుగా చేర్చుకోవ‌డానికి మేము సిద్ధ‌మేన‌ని మంచు విష్ణు వెల్ల‌డించారు. బ‌య‌టి భాష‌ల న‌టుల‌ని త‌గ్గించి అత్య‌ధిక శాతం మ‌న వాళ్ల‌కు సినిమాల్లో అవ‌కాశాలు క‌ల్పించాల‌ని వివ‌రించార‌ని తెలిసింది.

ఇదిలా వుంటే ఆర్టిస్ట్ ల సంగ‌తి స‌రే కానీ `మా` బిల్డింగ్ మాటేంటి అనే సెటైర్లు ప‌డుతున్నాయి. `మా` అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో మంచు విష్ణు తాను అధ్య‌క్షుడిగా విజ‌యం సాధిస్తే సొంత ఖ‌ర్చుల‌తో `మా` బిల్డింగ్ ని నిర్మిస్తాన‌ని హామీ ఇచ్చారు. అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించి కొన్ని నెల‌లు కావ‌స్తున్నా ఇంత వ‌ర‌కు `మా` బిల్డింగ్ గురించి ఒక్క అప్ డేట్ ని కూడా ఇవ్వ‌లేదు. దీంతో ఈ మీటింగ్ ల కేం గానీ `మా` బిల్డింగ్ మాటేంటి? అని కొంత మంది ఆర్టిస్ట్ లు మంచు విష్ణుపై సెటైర్లు వేస్తున్నార‌ట‌.
Tags:    

Similar News