ముందే ట్విస్టు ఇచ్చిన పూరి జగన్నాథ్

Update: 2019-01-28 12:59 GMT
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. యువ కథానాయకుడు రామ్‌తో ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. హిట్ కోసం డెస్పరేషన్లో ఉన్న పూరికి ఈ సినిమా ఎంతో కీలకం. ఈసారి పూరి కచ్చితంగా హిట్ కొడతాడని చిత్ర బృందం అంటోంది. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచిన ‘పోకిరి’ స్టయిల్లో పూరి యాక్షన్ థ్రిల్లర్ ట్రై చేస్తున్నాడని.. ఇందులో ఊహించని ట్విస్టులుంటాయని.. అవే సినిమాకు హైలైట్ అవుతాయని అంటున్నారు.

ఐతే సినిమాలో ట్విస్టుల సంగతేమో కానీ.. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో పెద్ద ట్విస్టే ఇచ్చాడు పూరి. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం అను ఇమ్మాన్యుయెల్‌ ను కథానాయికగా ఎంచుకోవాలనుకుంటున్నట్లు ముందు నుంచి వార్తలొస్తున్నాయి. ఐతే ఇంతకుముందు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్లతో నటించిన అను.. రామ్ లాంటి మీడియం రేంజి హీరోతో నటించడానికి నిరాకరించిందని.. పారితోషకం దగ్గర కూడా బెట్టు చేసిందని.. దీంతో ఈ చిత్ర సమర్పకురాలు ఛార్మి ఆమెతో నెగోషియేట్ చేస్తోందని అన్నారు.

మరోవైపు ‘ఇస్మార్ట్ శంకర్’ కథానాయికగా నభా నటేష్ పేరు కూడా వినిపించింది. కానీ వీళ్లిద్దరూ కాదని ఎవ్వరూ ఊహించని విధంగా నిధి అగర్వాల్‌ ను కథానాయికగా ఖరారు చేసి ఆశ్చర్యపరిచాడు పూరి. ‘ఇస్మార్ట్ హీరోయిన్’ నిధినే అంటూ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ బాలీవుడ్ భామ ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌ కు పరిచయం అయింది. అది డిజాస్టర్ అన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆమె నటించిన ‘మిస్టర్ మజ్ను’ డివైడ్ టాక్‌ తో నడుస్తోంది. ఆ సినిమా ఫలితంపై ఇంకా ఒక అంచనాకు రాకముందే నిధికి ఒక క్రేజీ ప్రాజెక్టులో అవకాశం రావడం విశేషమే.


Tags:    

Similar News