నీహారిక రెండో వెబ్ సిరీస్ రెడీ

Update: 2017-10-11 07:30 GMT
కొణిదెల నీహారిక సినిమాలో అరంగేట్రానికి ముందే.. వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ముద్దపప్పు-ఆవకాయ్ అంటూ ఈమె నటించిన వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. నెట్ జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒక మనసు అంటూ ఈమె చేసిన సినిమా.. రియలిస్టిక్ గా ఉందనే టాక్ వచ్చినా.. జనాలను మాత్రం మెప్పించలేకపోయింది.

రీసెంట్ గా నీహారిక రెండో సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఈమె నటించిన రెండో వెబ్ సిరీస్ సిద్ధమయిపోయిందని తెలుస్తోంది. నాన్న కూచి అనే టైటిల్ పై నీహారిక నటించిన వెబ్ సిరీస్ రూపొందగా.. దీన్ని కూడా ముద్దపప్పు-ఆవకాయ్ దర్శకుడు ప్రణీత్ బ్రహ్మానందపల్లి రూపొందిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో టైటిల్ కి తగినట్లుగానే నీహారిక నాన్న అంటే ప్రాణం పెట్టేసే యువతిగా నటించిందని తెలుస్తోంది. అయితే.. నాన్న పాత్రలో స్వయంగా నాగేంద్ర బాబే నటించడం అసలు సిసలు విశేషం. ఇప్పటికే నాన్నకూచి షూటింగ్ కూడా పూర్తయిపోయిందట. ప్రణీత్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చేయడంతో.. నాగబాబు.. నీహారికలు మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేసి.. ఫినిష్ చేసేశారట కూడా.

మెగా వారసురాలిగా నీహారిక మొదటి వెబ్ సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ ను బేస్ చేసుకుని.. రెండో వెబ్ సిరీస్ కు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే లీడింగ్ డిజిటల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ తో చర్చలు నిర్వహిస్తున్నారట. ప్రస్తుతం నాన్నకూచి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. త్వరలోనే దీనిపై అనౌన్స్ మెంట్ రానుంది.
Tags:    

Similar News