పీవీపీ బాటలో మరో బిజినెస్ మ్యాన్

Update: 2016-09-12 19:30 GMT
కార్పొరేట్ సంస్థలు సినీ నిర్మాణంలోకి రావడం బాలీవుడ్ లో ఎప్పట్నుంచో ఉన్నదే. ఐతే ఈ మధ్య సౌత్ సినిమాల మీద కూడా కార్పొరేట్ల కళ్లు పడుతున్నాయి. వేల కోట్ల వ్యాపారాలున్న పొట్లూరి వరప్రసాద్ కొన్నేళ్ల కిందటే సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అరడజనుకు పైగా సినిమాలు తీశారు. అందులో చాలా వరకు భారీ సినిమాలే. జయాపజయాల సంగతలా ఉంచితే.. ఆ సినిమాల్లో క్వాలిటీకి మాత్రం తిరుగుండదు. అలా తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ సంపాదించుకున్నాడు పీవీపీ. ఇప్పుడు ఈయన బాటలోనే మరో ప్రముఖ వ్యాపారవేత్త కూడా సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. ఆయనే నిమ్మగడ్డ ప్రసాద్.

పీవీపీ లాగా ఆరంభం నుంచే భారీ సినిమాల మీద దృష్టిపెట్టట్లేదు నిమ్మగడ్డ. నిర్మాతగా తొలి ప్రయత్నంలో ఆయన ‘నిర్మలా కాన్వెంట్’ లాంటి చిన్న సినిమా తీశాడు. అది కూడా తన మిత్రుడు నాగార్జున భాగస్వామ్యంలో. ఐతే ఈ సినిమా తర్వాత ఆయనకు భారీ ప్రణాళికలే ఉన్నాయట. వరుసగా సినిమాలు తీసే ఆలోచన చేస్తున్నారట. అందులో భారీ చిత్రాలు కూడా ఉంటాయట. నిమ్మగడ్డ ప్రసాద్ కు సినీ రంగంతో పరిచయం లేకేమీ కాదు. ఆయన ఎప్పట్నుంచో నిర్మాతలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. కొన్ని సినిమాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఇక నాగార్జున అండ కూడా ఎలాగూ ఉంది. కాబట్టి ఈ రంగంలోనూ తన హవా సాగించగలరని భావిస్తున్నారు. చూద్దాం.. ఆయన ఏం సాధిస్తారో.
Tags:    

Similar News