జూలై 26న హీరో నితిన్ వివాహం...!

Update: 2020-07-18 13:00 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సందడి నడుస్తోంది. కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా కనిపించకపోవడంతో వాయిదా వేసుకున్న శుభకార్యాలు ఒక్కటిగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి చేసుకోగా దగ్గుబాటి రానా ఆగస్టు 8న పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇక హీరో నితిన్ - షాలినిల పెళ్లి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరి వివాహం జూలై 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకి శుభముహూర్తాన హైదరాబాద్ లోనే వైభవంగా నిర్వహించబోతున్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ని అనుసరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహం జరిపించడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితుల వల్ల నితిన్ - షాలిని వివాహ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది స్నేహితులు ప్రముఖుల సమక్షంలో జరిపించనున్నారు. వాస్తవానికి ఫిబ్రవరిలో పసుపు కుంకుమ ఫంక్షన్ చేసుకున్న నితిన్ - షాలిని జంట దుబాయ్‌ లో గ్రాండ్ గా డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ క‌రోనా మహమ్మారి కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో.. ఆ ఆలోచన విరమించుకొని జూలై 26న హైదరాబాద్ లోనే వివాహ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో 'భీష్మ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. ముందుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాకుండా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటితో ఓ సినిమా మరియు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాదున్' తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. వీటితో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా చేయనున్నాడు.
Tags:    

Similar News