పొగడ్తలు సరే బాక్సాఫీస్ కలెక్షన్లు ఏవి ?

Update: 2019-07-13 17:30 GMT
ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమా విడుదలకు ముందు ప్రీమియర్లు వేయడం సెలెబ్రిటీలకు చూపించి వాళ్ళు ఆహా ఓహో అన్న వీడియోలను ప్రమోషన్ కోసం బైట్లుగా వాడటం. ఆ తర్వాత ఇంతమంది గొప్పగా మెచ్చుకున్నారు కాబట్టి మాది బ్లాక్ బస్టర్ అంటూ ప్రేక్షకులను ఓరకంగా ముందే ప్రిపేర్ చేయడం ఇదంతా ఓ తంతుగా మారిపోయింది. తీరా రిలీజ్ రోజు చూస్తే అంతంత మాత్రంగానే వసూళ్లు. సగం హాళ్లు నిండటమే గొప్ప అనేలా రిపోర్టులు.

మొదటి రోజు మూడు ఆటలు పూర్తి కావడం ఆలస్యం సినిమా ఆఫీస్ బయట భారీగా బాణాసంచా కాల్చి సక్సెస్ మీట్ అంటూ వచ్చిన మీడియా ప్రతినిధుల ముందు మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేసిన క్యాసెట్ మాటలే రిపీట్ చేసి ఇంకో రెండు జోడించి మమ అనిపించేస్తారు. ఇదంతా ఓ తంతుగా మారిపోయింది. ఇంతా చేసి సదరు సినిమాలు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయా అంటే అదీ లేదు. రెంటు గిట్టుబాటు అయితే చాలు మహాప్రభో అనేలా బిసి సెంటర్ల ఎగ్జిబిటర్లు మొత్తుకునే పరిస్థితి

మరి పైన చెప్పిన మాటలు పొగడ్తల మూటల సంగతి ఏమిటి అని అడిగితే అంతా గప్ చుప్. దీని వల్ల ఎవరికి లాభమయా అంటే నిర్మాతకు మాత్రమే. ఒకవేళ అప్పటికి శాటిలైట్ డిజిటిల్ డీల్స్ కనక జరగకపోయి ఉంటే హక్కులు కొనే సంస్థలు ఈ హంగామా చూసి అసలు ఇవ్వాల్సిన రేట్ కన్నా కాస్త ఎక్కువ ముట్టజెబుతాయన్న మాట. ఈ కారణంగానే రెండు నెలల క్రితం బిలో యావరేజ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచిపోయిన ఓ మూవీకి డిజిటల్ హక్కులు రెండున్నర కోట్ల దాకా వచ్చాయి.

నిర్మాత కోణంలో ఇదంతా బాగానే ఉంది కానీ క్షేత్ర స్థాయిలో కలెక్షన్స్ లేక ముఖ్యంగా సింగల్ స్క్రీన్స్ చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కంటెంట్ గురించి గొప్పలు పోవడమే తప్ప అవి వసూళ్లుగా మారనప్పుడు దాన్ని గొప్ప సినిమా అని ఎలా అంటామని వాళ్ళ ప్రశ్న. అందులో లాజిక్ ఉంది కానీ మేజిక్ తో సినిమా బిజినెస్సులు చేసే పరిశ్రమలో దానికి బదులు చెప్పేదెవరు. కోట్లు ఖర్చు పెట్టే పబ్లిసిటీ కన్నా స్క్రిప్ట్ దశలోనే పక్కాగా ఉండాల్సిన కంటెంట్ ముఖ్యమని గుర్తించేదెవరు

    

Tags:    

Similar News