వైజాగ్ ఫిలిం స్టూడియోలు ఏమైన‌ట్టు?

Update: 2019-11-21 01:30 GMT
ఏపీ- తెలంగాణ డివైడ్ త‌ర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఫిలింఇండ‌స్ట్రీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అదే స‌మ‌యంలో ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులు బీచ్ సొగ‌సుల‌ వైజాగ్ లో భారీగా సినిమా స్టూడియోల్ని నిర్మించే ఆలోచ‌న చేశార‌ని తామ‌ర‌తంప‌ర‌గా వార్త‌లు వ‌చ్చాయి. వైజాగ్ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తో మెగా ఫ్యామిలీకి ఉన్న స‌త్సంబంధాల దృష్ట్యా అక్క‌డ స్టూడియోల నిర్మాణానికి ప్లాన్ చేశార‌ని ప్ర‌ముఖంగా ప్ర‌చార‌మైంది. ఇక మెగాస్టార్ చిరంజీవి త‌న విరామ స‌మ‌యాన్ని ప్ర‌శాంత‌ విశాఖ‌న‌గ‌రం లోనే గ‌డుపుతాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డం.. అల్లు అర‌వింద్- చ‌ర‌ణ్ వంటి వారికి వైజాగ్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా.. ఇక మెగా స్టూడియో నిర్మాణం సాగుతుంద‌ని భావించారు.

వైజాగ్ భీమిలి ప‌రిస‌రాల్లో మెగాస్టార్ కి 1000 ఎక‌రాల ల్యాండ్ ఉంద‌ని అక్క‌డ స్టూడియో నిర్మించి బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో ప్ర‌శాంత జీవితాన్ని ఆస్వాధిస్తార‌ని మెగాభిమానులు భావించారు. దీనిపై ఉత్త‌రాది జిల్లాల్లో విస్త్ర‌తంగానే చ‌ర్చ సాగింది. కానీ ఇంత‌వ‌ర‌కూ దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఇవ‌న్నీ కేవ‌లం ప్ర‌చారం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యాయని తాజా స‌న్నివేశం చెబుతోంది.

ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవికి హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లోని కోకాపేట ప‌రిస‌రాల్లో ఉన్న ఎక‌రాల తోట‌లో భారీగా ఫిలింస్టూడియోని నిర్మించే అవ‌కాశం ఉంద‌ని మ‌రో ప్ర‌చారం వేడెక్కించింది. దీంతో అటు బీచ్ సొగ‌సుల  వైజాగ్ లో ఓ స్టూడియో.. ఇటు హైద‌రాబాద్ లో వేరొక స్టూడియో నిర్మించే వీలుంద‌ని భావించారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి తాజా స‌మాచారం లేదు. స‌రిక‌దా.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు అప్ప‌టికప్పుడు త‌మ సొంత స్థ‌లాల్లో సెట్స్ వేసుకుని సినిమా షూటింగులు పూర్తి చేసి తిరిగి వాటిని తొల‌గిస్తున్నారు త‌ప్ప స్టూడియో నిర్మించాలి.. ల్యాబులు క‌ట్టాలి.. టెక్నాల‌జీని తేవాల‌న్న ప్యాష‌న్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని కూడా తాజా స‌న్నివేశం చెబుతోంది. ప్ర‌స్తుతం సినిమా రంగంలోని బ‌డా ప‌ర్స‌నాలిటీస్ అంతా షాపింగ్ కాంప్లెక్సులు.. భారీ మాల్స్ నిర్మాణంపైనా దృష్టి సారిస్తున్నారు త‌ప్ప క‌ళారంగం మ‌నుగ‌డ గురించి అంత సీరియ‌స్ గా ఆలోచిస్తున్న‌ది లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భారీగా ఆదాయ మార్గాలు త‌ప్ప సోసోగా ఆదాయాలు తెచ్చే స్టూడియోల నిర్మాణం ఎవ‌రు చేస్తార‌న్న  విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇక వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ సైతం ఇప్ప‌టికే నామ‌మాత్రంగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆ ప‌రిస‌ర‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక స్టూడియో క‌డ‌తార‌ని గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌చార‌మైంది. ఇప్పుడు అస‌లు ఆ ఊసే లేదు.

   

Tags:    

Similar News