RRR కి ఆస్కార్ రావాలని టాలీవుడ్ లో ఎవరూ కోరుకోవడం లేదా..?

Update: 2022-10-07 09:30 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ''ఆర్.ఆర్.ఆర్'' ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కోసం ప్రచారం మొదలుపెట్టింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2023 అకాడమీ అవార్డ్స్ కు మనదేశం తరపున RRR చిత్రాన్ని అఫిషియల్ ఎంట్రీగా ఎంపిక చేయలేదు. 'చెల్లో షో' అనే గుజరాతీ చిత్రాన్ని ఆస్కార్ పరిశీలనకి పంపించింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ సినిమాని అనేక వ్యక్తిగత విభాగాలలో జ్యూరీ పరిశీలన కోసం సమర్పించినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రాబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం ఫర్ యువర్ కన్సిడరేషన్ (FYC) కింద పరిశీలనకు పంపుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 15 క్యాటగిరీలలో ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మన దేశం తరపున ఆస్కార్ పురస్కారాలకు పంపడానికి తిరస్కరించినప్పటికీ.. గ్లోబల్ ప్రశంసలు మరియు అభిమానుల డిమాండ్ మేరకు చిత్ర బృందం తమవంతు ప్రయత్నాల్ని కొనసాగిస్తోంది.

RRR సినిమాకు అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన తర్వాత.. కచ్చితంగా ఆస్కార్ కు నామినేషన్లు దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆస్కార్ అనేది ప్రపంచంలోనే సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తుంటారు. కానీ ఇప్పటి వరకూ ఏ తెలుగు చిత్రం లేదా భారతీయ సినిమాకి ఈ అవార్డ్స్ దక్కలేదు.

అయితే ఈసారి RRR సినిమాకి ఆ సత్తా ఉందని వెస్టర్న్ ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా తరపున ఎంట్రీ లభించకపోయినా.. సాధారణ కేటగిరీలో నామినేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని అన్ని విభాగాల్లో ఆస్కార్ కోసం దరఖాస్తు చేయడం సరైన నిర్ణయమని హాలీవుడ్ జనాలు అభినందిస్తున్నారు. అయితే టాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఈ విషయంలో మద్దతుగా నిలబడకపోవడం గమనార్హం.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని వివిధ విభాగాల్లో పరిశీలన కోసం క్యాంపెయిన్ చేస్తున్నట్లు టీమ్ ప్రకటించి తర్వాత.. అనేకమంది హాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్లు పెడుతూ తమ సపోర్ట్ అందించారు. #RRRforOscars అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ.. అవార్డు రావాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ మన టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

సెలబ్రిటీలు RRRకి ఆస్కార్ రావాలని మద్దతుగా నిలవడం అనేది అకాడమీ జ్యూరీని ఆకట్టుకోవడంలో సహాయపడకపోవచ్చు.. నామినేషన్స్ కోసం పంపించడానికి సభ్యులను ఒప్పించడంలో సహాయపడకపోవచ్చు. కానీ మన సపోర్ట్ అనేది చిత్ర బృందానికి నైతిక మద్దతునిస్తుంది. ముఖ్యంగా తన సినిమాను ప్రమోట్ చేయడానికి అమెరికాలో ఒంటరిగా క్యాంపెయిన్ చేస్తున్న రాజమౌళికి మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది.

RRR సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రశంసలు దక్కడం.. అక్కడి మీడియాలో కూడా ఈ సినిమాకి ఆస్కార్ ఖాయం అనే కథనాలు రాయడం జక్కన్న అండ్ టీమ్ కు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అందుకే ఇండియా తరపున వెళ్లే అవకాశం లేకపోయినా.. రాజమౌళి తన కుమారుడుతో కలిసి ప్రతిష్టాత్మక అవార్డ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కొన్ని రోజులుగా అమెరికాలోనే గడుపుతూ.. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రత్యేక ప్రదర్శనలకి హాజరవుతున్నారు. ప్రేక్షకుల స్పందనని ప్రత్యక్షంగా ఆస్వాదిస్తున్నారు. కానీ మన టాలీవుడ్ జనాలు మాత్రం RRR ఆస్కార్ రావాలని కోరుకుంటూ ఒక్క పోస్టు కూడా పెట్టడం లేదు. విష్ణు వర్ధన్ ఇందూరి లాంటి ఒకరిద్దరు మాత్రమే #RRRforOscars కోసం తమ మద్దతుని తెలియజేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు.

కొంతమంది సెలబ్రెటీలు రాజమౌళికి సందేశాలు పంపి ఉండవచ్చు లేదా కాల్ చేసి మద్దతు తెలిపి ఉండవచ్చు. కానీ ప్రజల ఆమోదం అనేది సినీ ప్రేమికులకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. చిత్ర బృందానికి నైతిక మద్దతుగా నిలిచి.. ఉత్సాహాన్ని ప్రేమను అందిస్తుంది. మరి ఇప్పటి నుంచైనా టాలీవుడ్ సెలబ్రిటీలు RRR కు ఆస్కార్ అవార్డు రావాలని తమ సపోర్ట్ అందిస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News