చిలుకూరులో పెళ్లి చేసుకోబోతున్న ఎన్టీఆర్

Update: 2017-04-23 10:52 GMT
జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా పెళ్లి చేసుకోబోవడం ఏంటి.. ఎప్పుడో ఆరేళ్ల కిందటే అతడి పెళ్లయిపోయింది కదా అంటారా..? ఇది నిజం పెళ్లి కాదులెండి. సినిమా పెళ్లి. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘జై లవ కుశ’ షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందులో ఒక కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నాతో ఎన్టీఆర్ పెళ్లి జరగనుంది. ఇందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను వేదికగా చేసుకున్నారు. ఇక్కడి దేవాలయం షూటింగులకు కూడా ప్రసిద్ధి. తరచుగా అక్కడ తెలుగు సినిమాల షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సిటీకి దూరంగా ఏ హడావుడి లేకుండా షూటింగ్ చేసుకోవడానికి వీలుంటుంది ఇక్కడ.

ఆలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చేయడానికి చిలుకూరు దేవాలయాన్ని మంచి వేదికగా భావిస్తారు సినిమా వాళ్లు. ఇప్పుడక్కడ ‘జై లవ కుశ’లోని పెళ్లి సన్నివేశం తీస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రకు రాశి జోడీగా నటిస్తోంది. మరో పాత్రకు నివేదా థామస్ కథానాయిక. మూడో పాత్రకు హీరోయిన్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ఈ సినిమాలో ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి హీరో ఫ్రెండుగా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News