టీజర్ టాక్: తెలుగు తెరపై మరో కొత్త కథ

Update: 2017-12-03 05:49 GMT
మనిషి నుంచి దయ్యం ఆత్మను వెళ్లగొట్టే కథల్ని వందల్లో చూశాం. కానీ మనిషి నుంచి దయ్యం ఆత్మ వెళ్లకుండా ఆపేందుకు హీరో ప్రయాస పడే సరికొత్త కథతో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాడు యువ దర్శకుడు వీఐ ఆనంద్. అతనిప్పుడు మరో భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఒక్క క్షణం’ టీజర్ ఈ రోజే విడుదలైంది. ఈ సినిమాతో ఆనంద్ మరో ఆసక్తికర ప్రయోగం చేయబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో కనిపించిన అగ్గిపుల్లల థియరీ నేపథ్యంలోనే ఈ టీజర్ మొదలుపెట్టాడు ఆనంద్. ఒక ప్రొఫెసర్ కొన్ని అగ్గిపుల్లలు పైనుంచి విసిరితే అందులో రెండు సమాంతరంగా పడతాయి. కొన్ని అగ్గిపుల్లలు రాండమ్ గా విసిరితేనే అందులో రెండు సమాంతరంగా పడ్డపుడు.. ఇద్దరు మనుషుల జీవితాలు ఒకేలా ఎందుకుండవు అని అడుగుతాడు ఆ ప్రొఫెసర్. ఈ మాట చెప్పి ఓ వ్యక్తి ప్రెజెంటే.. మీ ఫ్యూచర్ అంటూ హీరో హీరోయిన్లను భయపెట్టే విషయం చెబుతాడు. అప్పుడే అవసరాల శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తాడు. ఇందులో అతడిది భయానకమైన పాత్రలా ఉంది. ‘‘నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదికి వస్తే ఫేట్ తో అయినా.. డెస్టినీ తో అయినా.. చివరికి ఆ చావుతో అయినా పోరాడతా’’ అంటూ శిరీష్ చివర్లో చెప్పే డైలాగును బట్టి విలన్ నుంచి హీరోయిన్ని కాపాడే పాత్రలో అతను కనిపిస్తున్నాడని అర్థమవుతోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంటూనే సినిమా ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగేలా కనిపిస్తోంది. మొత్తానికి నిమిషం నిడివి ఉన్న టీజర్ తో ఆనంద్ ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించాడు. సురభి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని చక్రి చిగురుపాటి నిర్మించాడు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఒక్క క్షణం’.


Full View
Tags:    

Similar News