పది దాటేసిన పద్మావతి

Update: 2018-02-12 10:29 GMT
అనేక వివాదాలు, అడ్డంకుల్ని దాటుకుని జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘పద్మావత్’ సినిమా. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్.. అదిరిపోయే వసూళ్లతో మొదలైందీ చిత్రం. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. అక్కడ బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటయ్యే దిశగా ఈ చిత్రం దూసుకెళ్లింది. వారం రోజుల్లోనే 5 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ‘పద్మావత్’.. ఇప్పుడు 10 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి అరుదైన బాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం మూడో ఆదివారం 10 మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టింది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో ‘పద్మావత్’ స్థానం 3.

అమీర్ ఖాన్ సినిమాలు ‘దంగల్’ (12.3 మిలియన్ డాలర్లు).. ‘పీకే’ (10.5 మిలియన్ డాలర్లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ‘పద్మావత్’.. ‘పీకే’ను దాటి రెండో స్థానానికి చేరడం లాంఛనమే. ‘దంగల్’ను అందుకోవడం కొంచెం కష్టమే కావచ్చు. ఐతే తర్వాతి వీకెండ్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టగలిగితే ‘దంగల్’ను కూడా దాటేయొచ్చేమో. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండయన్ సినిమాగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం 21 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయడం విశేషం. ఆ రికార్డు బద్దలు కావడానికి చాలా సమయం పట్టొచ్చేమో. ఇక ‘పద్మావత్’ ఇండియాలో ఇప్పటికీ మంచి వసూళ్లే సాధిస్తోంది. మూడో శనివారం ఈ చిత్రానికి రూ.6.3 కోట్ల గ్రాస్ రావడం విశేషం. మొత్తం వసూళ్లు రూ.250 కోట్ల దాకా ఉన్నాయి.

Tags:    

Similar News