'ఇది మహేష్ కోసమే రాసుకున్న కథ.. ఆయన పాత్ర నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది'

Update: 2022-05-06 15:30 GMT
'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ పెట్లా.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో ''సర్కారు వారి పాట'' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మహేశ్ ను అభిమానులు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అలాగే ప్రెజెంట్ చేశాడు పరశురాం. మే 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో SVP దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

* 'సర్కారు వారి పాట' ఆలోచన ఎప్పుడు వచ్చింది?

౼ 'గీత గోవిందం' సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే సర్కారు వారి పాట ఆలోచన వచ్చింది. మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ ని రెడీ చేశాను.

* మహేష్ బాబును మీరు డిఫరెంట్ జోన్‌ లోకి తీసుకువచ్చారు. మీకు ఈ పాత్ర ఆలోచన ఎలా వచ్చింది?

౼ కథతో పాటు క్యారెక్టర్ డిజైన్ కూడా మహేష్‌ కి నచ్చడమే ఈ ప్రాజెక్ట్ జరగడానికి ప్రధాన కారణం.

* ట్రైలర్ చూస్తే ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది?

౼ అవును. సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. మహేష్ బాబు లుక్స్ - ప్రెజెంటేషన్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి. 'గీత గోవిందం' లాంటి హిట్ వచ్చినా ఒక మీడియం రేంజ్ దర్శకుడికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా అవకాశం ఇచ్చాడు అనే ప్రశ్న కొందరికి రావొచ్చు. కానీ సినిమా చూసిన తర్వాత అందరూ సంతోషిస్తారు.

* ట్రైలర్‌ లో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి..

౼ డైలాగ్స్ కథలోని సారాన్ని ప్రతిబింబిస్తాయి. రెండు విభిన్న మైండ్ సెట్స్ ఉన్న వ్యక్తుల మధ్య జరిగే కథ.

* మహేష్ బాబు ఇందులో బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తాడా? విజయ్ మాల్యా కథకు ఏమైనా లింక్ ఉందా?

౼ ఇందులో బ్యాంక్ టాపిక్ ఉంటుంది కానీ.. మహేష్ బ్యాంకు ఉద్యోగి కాదు. అలాగే ఈ కథ ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఒక వ్యవస్థను ప్రశ్నించే సినిమా. మంచి ఉద్దేశ్యంతో రాసిన కథ. చెప్పాలంటే ఇదొక సరదా కథ.

* మహేష్ తొలిసారి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడారు..?

౼ కథలో ఆయన పాత్ర స్వభావం అలా ఉంటుంది. ఈ కథలో నేను ఆయన్ని ఊహించుకున్న విధానం మహేష్‌ కి బాగా నచ్చింది.

* లవ్ ట్రాక్ ఎలా ఉండబోతోంది?

౼ అద్భుతంగా.. ఉల్లాసంగా ఉంటుంది. ఇందులో కీర్తి సురేష్‌ ది బలమైన పాత్ర. కథలో చాలా కీలకం.

* కీర్తి సురేష్ ఈ మధ్య కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. 'సర్కారు వారి పాట' లో ఆమెను తీసుకోడానికి కారణం ఏమిటి?

౼ లాక్‌ డౌన్‌ కు ముందే స్టోరీ ఫైనలైజ్ అయింది. కీర్తి తప్ప ఆ పాత్రకు నాకు వేరే ఆప్షన్‌లు లేవు. కీర్తిని హీరోయిన్‌ గా ఎందుకు తీసుకున్నామో సినిమా చూశాక అందరికీ అర్థమవుతుంది. ఇందులో ఆమె లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూశాక మహేష్ బాబుతో సమానంగా కీర్తి గురించి కూడా మాట్లాడుకుంటారు.

* సముద్రఖని పాత్ర ఏంటి?

౼ సముద్రఖని పాత్ర ఫెంటాస్టిక్ గా ఉంటుంది. అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమాలో ఆయన పాత్ర ఓ ఎస్సెట్‌ గా ఉండనుంది.

* సినిమాలో పాటల విషయంలో ఏమైనా ప్యాట్రన్ ఫాలో అయ్యారా?

౼ నేను ఎలాంటి ప్యాట్రన్ ఫాలో అవ్వను. పాట పెట్టడానికి నాకు బలమైన సిచ్యుయేషన్.. సరైన ప్లేస్ అవసరం. నేను ట్యూన్ మరియు సాహిత్యం విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. 'సర్కారు వారి పాట' సినిమాలో పాటలకు అద్భుతమైన మూమెంట్స్ దొరికాయి. ఎక్కడ అవసరమో అక్కడ పాట వస్తుంది. పాటలన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి.

* 'గీత గోవిందం' లాంటి చార్ట్‌ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన గోపీ సుందర్‌ ని ఎందుకు వదులుకున్నారు?

౼ గోపీసుంద‌ర్ ను అనుకున్న‌ప్పుడు అతను చాలా బిజీగా ఉన్నాడు. దాదాపు ఎనిమిది ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. నాకు వేరే ఆప్షన్ లేదు. గోపీ సుందర్‌ కి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.

* మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన సినిమాల్లో ఏదొక మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇందులో కూడా ఉంటుందా?

౼ మెసేజ్ ఉండదు కానీ ప్రయోజనం ఉంటుంది. సినిమా మొత్తం లైటర్‌ గా వినోదాత్మకంగా సాగుతుంది, చివర్లో అద్భుతమైన ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పాయింట్‌ కి కనెక్ట్ అవుతారు.

* ఈ కథను ముందుగా అల్లు అర్జున్‌ కి చెప్పారా?

౼ లేదు. ఈ కథ నేను మహేష్ బాబు కోసమే రాసుకున్నాను. భగవంతుని దయతో అతను ఈ సినిమా చేయడానికి అంగీకరించాడు. సూపర్ మహేష్ బాబుతో సినిమా చేయాలన్నది నా కల. 'సర్కారు వారి పాట' తో ఆ కల నెరవేరింది.

* దర్శకుడిగా ‘గీత గోవిందం’ మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌ ఏమిటి?

౼ ‘గీత గోవిందం’ సినిమా దర్శకుడిగా నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. 150 కోట్లతో సినిమా తీయగలననే నమ్మకం నాకు కలిగించింది. అది నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది

* సినిమాలో డాన్సుల గురించి?

మహేష్ బాబు డ్యాన్సులు అభిమానులను థ్రిల్ చేస్తాయి. డ్యాన్సులు అద్భుతంగా ఉంటాయి.

* 'నేను విన్నాను.. నేను ఉన్నాను' డైలాగ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నుంచి స్ఫూర్తి పొందారా?

౼ నేను దివంగత వైఎస్‌ఆర్‌ గారి అభిమానిని. వైఎస్ జగన్ గారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనేది మా సినిమాలోని స్పెసిపిక్ సీన్ కి సరిగ్గా సరిపోయే లైన్. ఫస్ట్ సిట్టింగ్‌ లోనే మహేష్‌ కి ఈ డైలాగ్‌ చెప్పాను. కథకు ఎలాంటి పొలిటికల్‌ కనెక్ట్‌ లేకపోవడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.

* డైలాగ్స్‌ కి మీ స్ఫూర్తి ఎవరు?

౼ నా గురువు పూరి జగన్నాధ్ మరియు త్రివిక్రమ్ గారు.

* మహేష్ బాబుతో పూరి రెండు సినిమాలు చేసాడు. ఆయన్నుంచి మీకు ఏవైనా ఇన్ ఫుట్స్ వచ్చాయా?

౼ మహేష్ తో సినిమా చేస్తున్నానని చెప్పగానే ఆల్ ది బెస్ట్ అన్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు. ‘దిస్ ఈజ్ మహేష్.. రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలపూడి బీచ్ సార్’ అనే డైలాగ్ పూరీకి చాలా బాగా నచ్చింది.

* సెన్సార్ పూర్తయిందా?

౼ అయింది. ఎలాంటి కటింగ్స్ లేవు. లెన్త్ ఖచ్చితంగా ఉంది. పూరి స్కూల్‌ నుంచి వచ్చిన వాళ్ళకి లెంగ్త్ సమస్య ఉండదు.

* థమన్‌ తో పని చేయడం ఎలా అనిపించింది?

౼ థమన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. 'సర్కారు వారి పాట' పాటల కోసం తమన్ యూనిక్ స్టైల్ లో వర్క్ చేసాడు.

* ఈ సినిమాలో మహేష్ బాబు డాటర్ సితార ఉంటుందా?

౼లేదు. ఆమె ప్రమోషనల్ సాంగ్‌ లో మాత్రమే ఉంటుంది. ఆ పాటలో ఆమె ఉండాలనేది తమన్ ఐడియా. దానికి మహేష్ బాబు ఓకే చెప్పారు.

* 'సర్కారు వారి పాట'ను పాన్-ఇండియా చిత్రంగా ఎందుకు చేయలేదు?

౼ మహేష్‌ కి గానీ నాకు గానీ ఆ ఆలోచన లేదు. మన సెన్సిబిలిటీతో ఈ చిత్రాన్ని రూపొందించాం. కానీ తెలుగు వెర్షన్ అన్ని చోట్లకు వెళ్తుంది.

* మీ తదుపరి సినిమాల గురించి?

౼ నాగ చైతన్య హీరోగా 14 రీల్స్ బ్యానర్ లో నా నెక్ట్ సినిమా చేయబోతున్నాను.
Tags:    

Similar News