పరుచూరిని అంత మాట అన్నారా

Update: 2018-01-03 19:30 GMT
సినిమా పరిశ్రమలో సీనియర్ మోస్ట్ రైటర్స్ గా పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా ఉంటూ ఎన్నో చరిత్ర సృష్టించిన సినిమాలకు తమ కలంతో బలం ఇచ్చిన ఈ అగ్ర రచయితల గుప్పిట్లో ఎన్నో ఆశ్చర్య పరిచే జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఈ మధ్య తరచుగా షేర్ చేసుకుంటున్న పరుచూరి గోపాలకృష్ణ తమను గతంలో శోభన్ బాబు మమ్మల్ని నరికేస్తాను అన్న సంఘటన ఒకటి షేర్ చేసుకున్నారు.

 1984లో మహా సంగ్రామం అనే మల్టీ స్టారర్ మూవీ ఒకటి వచ్చింది. అందులో కృష్ణ, శోభన్ బాబు హీరోలు. చాలా భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ మూవీ అంతగా విజయం సాధించలేదు. దానికి కథ మాటలు పరుచూరి బ్రదర్స్. నిజానికి ఈ కథను వాళ్ళు ఎన్టీఆర్ కోసం రాసుకున్నారు. కాని ఆయన రాజకీయ ప్రవేశంలో బిజీగా ఉండటంతో సంయుక్త బ్యానర్ అధినేత తిరుపతిరెడ్డికి వినిపించారు. ఆయన తన దగ్గర కృష్ణ, శోభన్ బాబు డేట్స్ ఉన్నాయని, ఇద్దరు ఉండేలా కథను మార్చి తీసుకురమ్మని చెప్పారట. ఆ బ్యానర్ లో చిరంజీవి హీరోగా అల్ టైం బ్లాక్ బస్టర్ ఖైది సినిమాకి రచయితలుగా పని చేసుండటం వల్ల వాళ్ళకు మంచి అనుబంధం ఉండేది.

దీంతో పరుచూరి బ్రదర్స్ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం అని చెప్పి సోలో హీరో పాత్రని రెండుగా మార్చి రాసి కృష్ణ - శోభన్ బాబు ని ఒప్పించి సినిమా సెట్స్ మీదకు వెళ్లారు. ఇందులో కృష్ణ నక్సలైట్ గా నటిస్తే శోభన్ బాబు మిలిటరి ఆఫీసర్ గా కనిపిస్తారు. నిడివి పరంగా, పాత్రలో డెప్త్ పరంగా శోభన్ బాబు కన్నా కృష్ణ పాత్రే హై లైట్ అయ్యింది. విడుదల అయ్యాక శోభన్ బాబు ఫాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తే ఇకపై మల్టీ స్టారర్ సినిమాలు తీయను అని పత్రికా ప్రకటన కూడా ఇచ్చే దాకా వచ్చింది పరిస్థితి.

 మిలిటరీ ఆఫీసర్ గా శోభన్ బాబు మీద తీసిన కామెడీ సీన్స్ అన్ని ఎడిటింగ్ లో తీసేయడంతో ఆ కోపంలో శోభన్ బాబు ఐ విల్ మసాకర్(నరికేస్తా) దట్ పరుచూరి బ్రదర్స్ అన్నారట. అది అప్పుడు అసహనంతో వచ్చిన మాటే కాని నిజంగా అన్నది కాదు లేండి. పరుచూరి వారే తన పాత్రను తగ్గించి రాసినట్టు ఫీల్ అవ్వడం వల్లే శోభన్ బాబు ఆ మాట అని ఉంటారు అని గోపాలకృష్ణ గుర్తు చేసారు. సౌమ్యుడైన శోభన్ బాబు ఇలాంటివి ఎక్కువ కాలం గుర్తుంచుకోరు. అందుకే కొంత కాలం తర్వాత పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించిన సర్పయాగం సినిమాలో హీరోగా నటించారు. అది మంచి హిట్ అయ్యింది కూడా.రోజా అందులో శోభన్ బాబు కూతురిగా నటించింది.  
Tags:    

Similar News