చిత్రపురి బండ‌రాళ్ల క‌థ‌!

Update: 2018-12-29 05:20 GMT
`ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డి చిత్ర‌పురి కాలనీ` హైద‌రాబాద్ గ‌చ్చిబౌళి న‌డిబొడ్డున ఉన్న కాల‌నీ ఇది. సినిమా 24 శాఖ‌ల కార్మికులు నివ‌శించే ఈ కాల‌నీ చ‌రిత్ర అన‌న్య సామాన్యం. గ‌జం భూమి దొరికితే చాలు బ‌కాసురుల్లా మింగేసే రోజుల్లో ఈ కాల‌నీ కోసం ఏకంగా 20 ఎక‌రాల భూమిని ఉదారంగా దాన‌మిచ్చారు లెజెండ‌రీ క్లాసిక్ న‌టుడు ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఆయ‌న దాన‌గుణం వ‌ల్ల ఇప్పుడు ఈ కాల‌నీలో వేలాది మంది సినీ కార్మికులు సొంత గృహాన్ని ఏర్ప‌రుచుకుని జీవిస్తున్నారు. ద‌ర్శ‌క‌ర‌త్న కీ.శే. డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్నంత కాలం కాల‌నీకి ఏ స‌మ‌స్య‌లు వ‌చ్చినా, కార్మికుల‌కు అండ‌గా నిలిచేవారు. ఆయ‌న సార‌థ్యంలో స‌మ‌స్య‌లు ప‌రిష్కరించుకునేవారు. ఆయ‌న ప్రోద్బ‌లంతో.. ప‌రిశ్ర‌మ పెద్ద‌ల స‌హ‌కారంతో బండ‌రాళ్ల‌ను సైతం పిండి చేసి ఈ కాల‌నీని నిర్మించారు. అస‌లు ఇది మ‌నుషులు నివ‌శించేందుకు అనువైన స్థ‌ల‌మేనా? .. ఈ కొండ‌లు, బండ‌రాళ్ల‌లో ఎవ‌రు బ‌త‌క‌గ‌ల‌రు?  నివాసాలకు కుదిరేలా  భ‌వంతులు ఎలా నిర్మిస్తారు? అన్న సందిగ్ధ‌త నుంచి చిత్ర‌పురి క‌మిటీ ఈ ఏరియాని హైద‌రాబాద్ లోనే బెస్ట్ ఆవాస స్థ‌లంగా మార్చింది. ఎంద‌రో కార్మికులు భుక్తి కోసం వేకువ‌ఝాము నుంచే పరుగులు పెడుతూ ఉండే వారి కోసం ఈ ఇళ్ల‌ను నిర్మించి ఇచ్చారు.

అయితే భూమితో పాటే గొడ‌వ‌లుంటాయి. డ‌బ్బుతో ముడిప‌డిన అంశంలో ఎన్నో చిక్కులు ఉంటాయి. స‌రిగ్గా ఇదే విష‌య‌మై గ‌త కొంత‌కాలంగా క‌మిటీలో బేధాభిప్రాయాలు పొడ‌సూప‌డం కాల‌నీలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. ఆ క్ర‌మంలోనే రెండో సారీ గెలిచి కాల‌నీ అధ్య‌క్షుడైన కార్మిక నాయ‌కుడు కొమ‌ర వెంక‌టేష్ స్థానంలో నూతన అధ్యక్షుడుగా క‌మిటీ కీల‌క స‌భ్యుడైన ర‌చ‌యిత‌ పరుచూరి వెంకటేశ్వర రావు నియమితులయ్యారు. అధ్యక్షుడు కొమర వెంకటేష్ మీద అభియోగాలు రావడంతో అతన్ని  జిల్లా సహకార శాఖ అధికారి కొమర వెంకటేష్ ను సస్పెండ్ చేయ‌డంపైనా కాల‌నీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌లే జరిగిన చిత్ర‌పురి క‌మిటీ అత్యవసర కార్యవర్గ సమావేశంలో వెంకటేశ్వర రావును అధ్య‌క్షుడిగా ఎంపిక చేశారు.  11 మంది కార్యవర్గ సభ్యుల్లో  ఎనిమిది మంది వెంకటేష్ ను వ్యతిరేకంగా సంతకాలు చేయ‌డంతో అత‌డు ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి వ‌చ్చింది. అయితే ఈ మార్పున‌కు కార‌ణం అతని పై అవినీతి ఆరోపణలు రావ‌డ‌మేన‌ని చెబుతున్నారు. ఇంత‌కుముందు కొమ‌ర వెంక‌టేష్ అధ్య‌క్షుడుగా ఉండ‌గా, పరుచూరి వెంకటేశ్వర రావు చిత్రపురి హౌసింగ్ సొసైటీ కి కోశాధికారిగా వున్నారు. ఇప్పుడు ఆయ‌న అధ్య‌క్షుల‌య్యారు. అయితే క‌మిటీలో విభేధాలున్నా ఆరంభం కార్మికులంద‌రి స‌హ‌కారంతో ఈ కాల‌నీ అభివృద్ధికి, ఇండ్ల నిర్మాణానికి క‌మిటీ తీవ్రంగానే శ్ర‌మించింది. అందులో కొమ‌ర భాగ‌స్వామ్యం ఉంది. ఆ మేర‌కు కార్మికుల్లో కృత‌జ్ఞ‌త ఉంది. అలాగే ఎంద‌రో కార్మికుల‌కు కొమ‌ర వెంక‌టేష్ ఎన్నో ర‌కాలుగా సాయం చేశార‌ని చెబుతుంటారు. ఆయ‌న‌కంటూ కార్మికుల్లో బ‌ల‌మైన స‌పోర్ట్ కాల‌నీలో ఉంది. అలాగే చిత్ర‌పురిలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేనున్నాను అంటూ ముందుకొచ్చే పెద్ద‌లు ప్ర‌స్తుత సంధి కాలంలో ఎంతో అవ‌స‌రం. కాల‌నీలో ఎన్నో స‌మ‌స్య‌లున్నాయి. అన్నిటి ప‌రిష్కారానికి కొత్త అధ్య‌క్షుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఏ మేర‌కు కృషి చేస్తారోన‌న్న‌ ఆస‌క్తి నెల‌కొంది.

నిజాయితీగా కాల‌నీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న‌ది పెద్ద టాస్క్. కాల‌నీలో ఇప్ప‌టికే పైపుల లీకేజీలు, బాత్రూమ్ లలో వాట‌ర్ లీకేజీ స‌మ‌స్య‌ల‌ పై చిత్ర‌పురి వాసులు బోలెడ‌న్ని ఫిర్యాదులు ఇచ్చారు. ఏళ్ల త‌ర‌బ‌డి ఇవ‌న్నీ పెండింగులోనే ఉన్నాయి. దీంతో క‌మిటీ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇప్పుడు క‌నీసం కొత్త అధ్య‌క్షుడు అయినా ఈ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తార‌న్న ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రో రెండేళ్ల పాల‌న ఉండ‌గానే కొమ‌ర వెంక‌టేష్ ని దించేశారు కాబ‌ట్టి, ప‌రుచూరి వారు అయినా కాల‌నీ స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుని ప‌రిష్కారం దిశ‌గా ఆలోచించాల‌ని కార్మికులు కోరుతున్నారు. అలా కాకుండా కాల‌యాప‌న చేస్తే రెండేళ్ల‌లోనే ఎన్నిక‌లున్నాయ‌ని చెబుతున్నారు కాబ‌ట్టి ఆ ప్ర‌భావం ఓటింగ్ రూపంలో బ‌య‌ట‌ప‌డుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన చోట నీతిమంతంగా ఉండి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తేనే ఈ గ‌డ్డు కాలం గ‌ట్టేక్కేది అని నిపుణులు సూచిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?
Tags:    

Similar News