దీనస్థితిలో పావలా శ్యామల.. 'మా' నుంచి సాయం అందడం లేదని ఆవేదన..!

Update: 2022-11-03 12:36 GMT
సీనియర్ నటి పావలా శ్యామల గురించి ఈతరం సినీ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిందామె. 'ఆంధ్రావాలా' 'మనసంతా నువ్వే' 'ఖడ్గం' వంటి చిత్రాల్లో ఆమె పాత్రలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అయితే వయసు మీద పడటంతో పాటు అనారోగ్యం సమస్యలతో సినిమాలకు దూరమైంది. తనతో పాటు తన కుమార్తె అనారోగ్యం పాలవ్వడం.. ఆర్థిక సమస్యలు రావడంతో గత కొంతకాలంగా దయనీయమైన జీవితాన్ని గడుపుతోంది.

ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి ఓ అనాథ ఆశ్రమంలో జీవిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన దీనస్థితి గురించి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసింది పావలా శ్యామల. తను చనిపోతే కుమార్తె పరిస్థితి ఏంటనేది తనని తీవ్రంగా బాధిస్తోందని చెప్పింది. హీరో చిరంజీవి చేసిన సాయం గురించి గుర్తు చేసుకున్న శ్యామల..ఇప్పుడు 'మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్' (మా) నుంచి తనకు ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పుకొచ్చింది.

శ్యామల మాట్లాడుతూ.. ''మా అసోషియేషన్‌ లో మెంబర్‌ షిప్ లక్ష రూపాయలు అయింది. అవి ఏదైనా అవసరానికి వస్తాయిలే అని కట్టలేదు. అయితే నాకు జబ్బు చేసి, మా అమ్మాయికి బాగా లేదని తెలిసి చిరంజీవి గారు రూ. 1 లక్ష కట్టి మెంబర్‌ షిప్ చేయించారు. చిరంజీవి గారి వల్లే ఇప్పుడు నేనూ 'మా' లో మెంబెర్ గా ఉన్నాను. అలానే మా అమ్మాయి వైద్యం కోసం రూ.2 లక్షలు ఇచ్చారు'' అని తెలిపింది.

మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత అందిన సాయం గురించి మాట్లాడుతూ.. ''నా బాధ్యత ఒకావిడాకు అప్పజెప్పారు. ఆమె మమ్మల్ని ఒక హోమ్ లో పెట్టింది. 'నీకు ఆపరేషన్ చేయిస్తా.. 6 లక్షలు అవుతాయి.. అందులో 2 లక్షలు మా అసోసియేషన్ తరపున వస్తాయి.. మిగతా 4 లక్షలు మీరు పెట్టుకోవాల్సిందే. మిమ్మల్ని ఒక హాస్పిటల్ లో జాయిన్ చేసి చూపిస్తాం. మీ కూతురి సంగతి మాకు తెలియదు' అని మాట్లాడింది''

''ఆపరేషన్‌ కి నీ శరీరం సహకరించదు.. ఆపరేషన్ చేస్తే నీ ప్రాణాలు ఉండవని.. మందులుతోనే బ్రతికినంత కాలం బ్రతుకుతారని.. ఆపరేషన్స్ జోలికి వెళ్ళొద్దని ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు.  అలాంటపుడు నేను ఆపరేషన్‌ ఎలా చేయించుకోను. నేను బ్రతకడం కంటే నాకు అమ్మాయి ఆరోగ్యం ముఖ్యం. నేను యాక్టర్ ని కాబట్టి నాకు మెంబెర్ షిప్ ఉంది. మా అమ్మాయికి లేదు. అందుకే అమ్మాయి గురించి అనవసరం అన్నారు''

''ఆరోగ్యం సహకరించిందని నేను ఆపరేషన్ చేయించుకోలేనని చెప్తే.. 'సరే ఇంక నాకు ఫోన్ చేయద్దు.. నీకు నాకు సంబంధం లేదని' చెప్పి ఆవిడ వెళ్లిపోయింది. 'మా' వాళ్ళు నా బాధ్యత ఆవిడకు అప్పజెప్పారట. ఆమె ఏమో 'నా మాట విననప్పుడు నీకూ నాకూ సంబంధం లేదు. ఇకపై ఫోన్ చెయ్యద్దు' అని వెళ్లిపోయింది. అది జరిగిన తర్వాత నేనూ ఫోన్ చేయలేదు.. ఆవిడా చేయలేదు''

'మా' నుంచి నాకు ఎవరూ చేయలేదు. నాకు 'మా' డైరీ కూడా పంపలేదు. ఎవరి ఫోన్ నంబర్లు లేవు. విష్ణు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత 'మీకు బాగా పాలిస్తున్నానని అనుకోకూడదు. మీరు కాస్త గమనిస్తూ ఉండండి. మీరు ఎవరెవరికి ఏయే పనులు అప్పజెప్పారో.. వారు ఎంత వరకూ సక్రమమంగా పనిచేస్తూన్నారో కొంచం గమనించండి' అని చెప్పాలని అపుడప్పుడు అనుకుంటానని శ్యామల చెప్పుకొచ్చింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి ఆ మధ్య పావలా శ్యామలకు సాయం చేసి తప్పు చేశానని మాట్లాడటంపై ఆమె స్పందించింది. ''అది ఆమె మనఃసాక్షికే వదిలేస్తున్నాను. ఆమె మా ఇంటికి వచ్చింది. అప్పుడు నా కూతురు అనారోగ్యంతో ఉంది. 'ఇళ్లంతా కంపు కొడుతోంది. అసహ్యం వేసింది. నేను సాయం చేయాలని పోతే తీసుకోలేదు. ఎవరు సాయం చేసినా ఆమె తీసుకోదు. నాకు ఇంత కావాలి అని డిమాండ్ చేస్తుంది' అన్నట్లు ఛానల్ లో చెప్పడం నేను విన్నాను''

''సాయం చేస్తామని వచ్చిన వారిని ఎవరైనా ఇంత కావాలి అని అడుగుతారా? కరాటే కళ్యాణి చెప్పేవన్నీ ఒట్టి మాటలు. మరి నేను ఆవిడకు ఏం అపకారం చేశానో. ఆమె బ్రతకదు.. మరికొన్ని రోజుల్లో చనిపోయే వారి మీద కూడా అబద్ధాలు చెప్తారా? ఇలాంటి రూమర్స్ సృష్టిస్తారా? మా అమ్మాయి అనారోగ్యంతో మంచాన ఉంది. నేను లేచి ఇల్లు శుభ్రంగా పెట్టుకునే పరిస్థితిలో లేను. ఇద్దరికీ బాగా లేనప్పుడు ఇల్లు శుభ్రంగా అందంగా ఎలా ఉంటుంది? ’’ అని పావలా శ్యామలా ఆవేదన వ్యక్తం చేసింది.

''గతంలో సాయం చేసిన దాంతో ఇప్పటి వరకూ లాక్కొచ్చాను. ఇల్లు ఖాళీ చేసి హోమ్ కి వచ్చేసాము. ఈ నెల నుంచి డబ్బులు కట్టే పరిస్థితిలో లేను. మాకు ఎలాంటి బ్రతుకుదెరువు లేదు. ఆత్మహత్య చేసుకోవడం కూడా ఇప్పుడు చేతకాదు. బయటకు వెళ్లి ఏదైనా మందు కొనుక్కొని తాగి చనిపోవడానికి కూడా మా ఇద్దరికీ నడవడానికి కాళ్ళు పనిచేయవు'' అంటూ పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News